కోల్‌కతా దుర్గాపూజలో పెను విషాదం.. తొక్కిసలాటలో 17 మంది భక్తులు మృతి..!

కోల్‌కతా దుర్గాపూజలో పెను విషాదం.. తొక్కిసలాటలో 17 మంది భక్తులు మృతి..!

బెంగాల్: దసరా పండుగ వేళ వెస్ట్ బెంగాల్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. నార్త్ కోల్‌కతాలోని సర్బోజనిన్ చోర్‌బగాన్ దుర్గా మండపం దగ్గర తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా.. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

అధికారుల వివరాల ప్రకారం.. శనివారం (అక్టోబర్ 17) సాయంత్రం అమ్మవారి దర్శనం కోసం చోర్‌బగాన్ దుర్గా మండపానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సమయంలోనే భారీ వర్షం కురువడంతో మండపం బయట ఉన్న భక్తులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే మండపంలోని కొంత భాగంగా కుప్పకూలి భక్తులపై పడింది. 

తొక్కిసలాట, మండపం కుప్పకూలడంతో కనీసం 17 మంది మరణించగా.. 25 నుంచి 35 మందికి పైగా భక్తులు గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోల్ కత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‎కు తరలించారు. ప్రస్తుతం అక్కడ క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భద్రతా కారణాల దృష్ట్యా చోర్‌బగాన్ పండాల్‌ను తాత్కాలికంగా మూసివేసి, భక్తుల సందర్శనను నిలిపివేశారు.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి శరద్వత్ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.