ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్‌‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌‌ సిగ్నల్

ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్‌‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌‌ సిగ్నల్

హైదరాబాద్‌‌, వెలుగు: సమ్మె విరమణ సమయంలో అంగీకరించిన డిమాండ్లను సర్కారు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. ఆర్టీసీ యూనియన్‌‌ ప్రతినిధులు ఇచ్చిన డిమాండ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పరిశీలిస్తోంది. వాటి అమలుకు అవసరమైన పాలనా అనుమతులను జారీ చేస్తోంది.

తాజాగా ఆర్టీసీలో జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. కొంతకాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఫైల్‌‌ను పరిశీలించిన ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి బుధవారం ఆర్టీసీ బస్‌‌ భవన్‌‌కు పంపించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 130 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది.

ఆర్టీసీలో పనిచేస్తున్న అర్హులైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు ఈ పోస్టుల్లో అవకాశం కల్పించే అంశాన్ని సంస్థ ఎండీ నాగిరెడ్డి పరిశీలిస్తున్నారు. సమ్మె విరమణ సమయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్లలో జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ పోస్టుల భర్తీ కూడా ఒకటి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ డిమాండ్‌‌ నెరవేరే అవకాశం ఉంది.