అమ్మవారి ముందు ఎలాంటి డ్రామాలు చేయలేదు: జోగిని శ్యామల

అమ్మవారి ముందు ఎలాంటి డ్రామాలు చేయలేదు: జోగిని శ్యామల

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా తనకు జరిగిన న అవమానం, ప్రభుత్వ తీరుపై  జోగిని శ్యామల స్పందించారు.   మహంకాళి బోనాల్లో ప్రభుత్వం తమను తీవ్రంగా అవమానించిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ రోజు తన బోనం పడకుండా వేరే వాళ్ల బోనం పెట్టారని, చివరి క్షణంలో మారుబోనం చేయమంటూ తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. ముందస్తు సమావేశాల్లో అన్ని వివరాలు అంగీకరించి, పండుగ రోజు కావాలనే హడావుడి చేశారని ఆరోపించారు.

తాను స్పృహ కోల్పోయిన ఘటనను కొంతమంది డ్రామాగా చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు. అమ్మవారి ముందు ఎలాంటి డ్రామాలు చేయమని, జోగినిలుగా నృత్యం చేయడం, అలంకరించి బోనం సమర్పించడం తమ సాంప్రదాయమని స్పష్టం చేశారు.

తాము ఏ రాజకీయ పార్టీకి అమ్ముడుపోలేదని, కొందరు శివశక్తులు, జోగినిలే తమపై తప్పుడు ప్రచారం చేయడం క్షమించరానిదన్నారు. జోగిని వ్యవస్థను కాపాడాలని కోరిన ఆమె... జోగినిలను ఏడిపించిన ప్రభుత్వం కూడా ఏడుస్తుందని హెచ్చరించారు. బోనాల బోర్డు కమిటీలో కనీసం ఒక శివశక్తికి స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.

మహిళా ఎండోమెంట్ మంత్రి ఉన్నప్పటికీ తమకు ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఎవరైనా మారొచ్చు కానీ తాను మాత్రం జోగినిల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని, తమ కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని జోగిని శ్యామల హెచ్చరించారు.