భారతీయ ఐటీ రంగంలో వర్క్ కల్చర్, ప్రొడక్టివిటీ, హైశాలరీస్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఒక భారతీయ టెక్ ప్రొఫెషనల్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ టెక్కీలకు ఉన్న క్రేజ్ వెనుక అసలు నిజం ‘కష్టపడి పనిచేయడం’ కాదని.. దానికి వేరే కారణాలు ఉన్నాయంటూ నిరాజ్ అనే టెక్కీ పెట్టిన పోస్ట్ ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఆ వైరల్ పోస్ట్‌లో నిరాజ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన టెక్ ఉద్యోగులు ‘హార్డ్‌వర్కర్స్’ ఏమీ కాదు.. వారు ఈ గ్రహం మీద అత్యంత చౌకైన, చెప్పినట్లు వినే లేబర్ మాత్రమే అంటూ తన పోస్టులో రాశారు. గంటల తరబడి అదనంగా పనిచేయడం, వీకెండ్స్ డ్యూటీలు చేయడం, పండుగల సమయంలోనూ లాగిన్ అవ్వడం, అర్ధరాత్రి యూఎస్ క్లయింట్ కాల్స్ మాట్లాడటం వంటి వాటన్నింటినీ మనవాళ్లు అస్సలు ఎదురుచెప్పకుండా.. కనీసం కాదు లేదూ అనకుండా సైలెంట్‌గా ఒప్పుకుంటారని విమర్శించారు. చెప్పింది చెప్పినట్లు తలఊపటం తప్ప మనోళ్లు గొప్పోళేమీ కాదంటూ పెట్టిన పోస్టు చాలా మందికి కోపం తెప్పిస్తోంది.
Indian tech workers aren't "hardworking". They're just the cheapest, most obedient labor on the planet.
— Niraj (@nirajxdev) June 21, 2026
12-14 hour days, weekends, festivals, 2 AM calls, all accepted with "sir, no problem".
Meanwhile foreign engineers do half the work for 5-8x the money and still have…
విదేశీ ఇంజనీర్లతో భారతీయ నిపుణులను పోలుస్తూ నిరాజ్ మరో ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. విదేశాల్లోని ఇంజనీర్లు మనకంటే చాలా ఎక్కువ జీతాలు తీసుకుంటూనే.. తమ పర్సనల్ లైఫ్, ఆఫీస్ పనికి మధ్య బలమైన సరిహద్దులను మెయింటైన్ చేస్తారని చెప్పారు. మనకు టాలెంట్ పరంగా ఎలాంటి అడ్వాంటేజ్ లేదు.. కేవలం ఉద్యోగం కావాలనే ఆరాటం, నిరాశ మాత్రమే ఉందని అన్నారు. ఇదే అసలైన ఇండియన్ టెక్ స్టోరీ అంటూ నిరాజ్ తేల్చిచెప్పారు.
ALSO READ : జంతర్ మంతర్ వద్ద నీళ్లు, కరెంట్ బంద్..
ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి స్పందిస్తున్నారు. నిరాజ్ మాటలతో ఏకీభవించిన కొందరు.. "నిజమే, మనవాళ్లు పర్సనల్ లైఫ్ పాడవుతున్నా ఆఫీస్ వర్క్‌కు నో చెప్పలేకపోతున్నారు. లీవ్ పెట్టినా కూడా లాప్‌టాప్ ముందే కూర్చుంటున్నారు" అని చెప్పారు. అయితే మరికొందరు ఈ వాదనను వ్యతిరేకించారు. వెస్ట్రన్ దేశాలు, చైనాతో పోలిస్తే మనవాళ్లు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడుపుతున్నప్పటికీ.. ప్రొడక్టివిటీ మాత్రం తక్కువగా ఉంటోందని ఒకరు కామెంట్ చేశారు.
ఇంకొందరు మాత్రం భారతీయ టెక్కీల వర్క్ ఎథిక్స్‌ను సమర్థిస్తూ.. తీవ్రమైన పోటీని తట్టుకుంటూ, నిరంతరం కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ ముందుకు సాగడం అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ వైరల్ పోస్ట్ ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో ఎదురవుతున్న బర్న్‌అవుట్, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై చర్చకు కారణంగా మారిపోయింది.
