ఆస్ట్రేలియాపై ఓడితే భారత్ ఇంటికేనా?.. సెమీస్ లెక్కలు ఇవే!

ఆస్ట్రేలియాపై ఓడితే భారత్ ఇంటికేనా?.. సెమీస్ లెక్కలు ఇవే!

Indian Womens Team Semi-Final: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ భవితవ్యాన్ని తేల్చే బిగ్గెస్ట్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడింది. జూన్ 28వ తేదీ ఆదివారం లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ అత్యంత కీలకమైన గ్రూప్-A మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన విజయం సాధిస్తే.. ఆరు పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్‌కు ఎంట్రీ ఇస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

ఆస్ట్రేలియాపై గెలిస్తే డైరెక్ట్ సెమీస్‌కు: 
భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడిస్తే.. టోర్నీలో ఆరు పాయింట్లతో గ్రూప్-A నుంచి నేరుగా సెమీఫైనల్‌కు అఫీషియల్‌గా క్వాలిఫై అవుతుంది. ఇతర జట్ల ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా నాకౌట్లోకి అడుగు పెడుతుంది. అందుకే ఈ మ్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ సేనకు టోర్నీలోనే అత్యంత కీలకమైన గేమ్ గా భావిస్తుంది. 

ఓడిపోతే నెట్ రన్ రేటే దిక్కు: 
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే నాలుగు పాయింట్ల దగ్గరే ఉండిపోతుంది, అప్పుడు సెమీస్ భవితవ్యం మన చేతుల్లో ఉండదు. ప్రస్తుతం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు కూడా చెరో నాలుగు పాయింట్లతో రేసులో ఉన్నాయి. భారత్ ఓడిపోయిన తర్వాత.. సౌతాఫ్రికా లేదా బంగ్లాదేశ్ జట్లలో ఏ ఒక్కరు తమ తదుపరి మ్యాచ్ గెలిచి ఆరు పాయింట్లకు చేరినా భారత్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఒకవేళ ఆ జట్లు కూడా నాలుగు పాయింట్ల దగ్గరే ఉండిపోతే, అప్పుడు రన్ రేట్ లెక్కిస్తారు. ప్రస్తుతం ఇండియా మంచి నెట్ రన్ రేట్ (+2.511) తో సేఫ్ జోన్‌లో ఉన్నప్పటికీ, ఓటమి మార్జిన్ పెరిగితే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.

గ్రూప్-A ప్రస్తుత పాయింట్ల పట్టిక: 
టోర్నీలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఇప్పటికే అఫీషియల్‌గా ఎలిమినేట్ అయిపోయాయి. ప్రస్తుతం గ్రూప్-A పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఆడిన 3 మ్యాచ్‌లూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో (NRR +2.511) కొనసాగుతోంది. సౌతాఫ్రికా (--0.546 NRR), బంగ్లాదేశ్ (-0.641 NRR) లు కూడా నాలుగు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉండటంతో సెమీస్ రేసు అత్యంత ఉత్కంఠగా మారింది.