- 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం
- చెలరేగిన కాప్, బ్రిట్స్
మాంచెస్టర్: వరుస విజయాలతో జోరుమీదున్న ఇండియా విమెన్స్ జట్టుకు టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా బ్రేక్‌లు వేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో మారిజానె కాప్ (45 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 నాటౌట్), తజ్మిన్ బ్రిట్స్ (40) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో టీమిండియాకు చెక్ పెట్టింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (31), దీప్తి శర్మ (29), హర్మన్‌ప్రీత్ కౌర్ (24) మెరుగ్గా ఆడారు.
పిచ్ బ్యాటింగ్‌కు సహకరించకపోవడంతో పాటు తప్పుడు షాట్ సెలెక్షన్‌తో ఇండియా బ్యాటర్లు ఇబ్బందులుపడ్డారు. స్మృతి మంధాన (17), షెఫాలీ తొలి వికెట్‌కు 30 రన్స్ జోడించారు. కానీ ఈ దశలో పుంజుకున్న సఫారీ బౌలర్లు వరుస విరామాల్లో ఈ ఇద్దరితో పాటు యాస్తికా భాటియా (15), జెమీమా రొడ్రిగ్స్ (12)ను ఔట్ చేశారు. ఫలితంగా ఇండియా 83/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి, హర్మన్ ఐదో వికెట్‌కు 33 రన్స్ జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు.
15వ ఓవర్లో హర్మన్ ఔట్‌తో ఇండియా మరింత ఇబ్బందుల్లో పడింది. 116/5 స్కోరు వద్ద వచ్చిన రిచా ఘోష్ (15), దీప్తితో కలిసి ఆరో వికెట్‌కు 21 రన్స్ జత చేసింది. చివర్లో అరుంధతి రెడ్డి (6 నాటౌట్), ప్రేమ రావత్ (3 నాటౌట్) బ్యాట్లు ఝుళిపించకపోవడంతో ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. కాప్, షాబ్నిమ్ ఇస్మాయిల్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 161/4 స్కోరు చేసింది.
25 రన్స్ వద్ద లారా వోల్‌వర్త్ (20), డెరెక్సన్ (0) ఔటైనా.. కాప్, బ్రిట్స్ నిలకడగా ఆడారు. మూడో వికెట్‌కు 97 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 17వ ఓవర్లో బ్రిట్స్, ఆ వెంటనే డి క్లెర్క్ (5) ఔట్‌తో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. చోలే ట్రయాన్ (10 నాటౌట్)తో కలిసి కాప్ ఈజీగా గెలిపించింది. శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టింది. కాప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
