తేజ సజ్జా హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తాజాగా జూన్ 25న త్రీడీ వెర్షన్‌లోఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన త్రీడీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ ‘హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్.
ఆయనను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది. త్రీడీ రూపంలో మరోసారి చూడటం ఆనందంగా అనిపిస్తుంది’ అని చెప్పాడు. తేజ సజ్జా మాట్లాడుతూ ‘త్రీడీ అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాదు.
ఇది నా అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. చాలారోజుల తర్వాత మళ్లీ ఈ టీమ్‌ను కలవడం సంతోషంగా ఉందని హీరోయిన్ అమృత అయ్యర్ చెప్పింది. ఈ సినిమాను 2డీలో ఎంతగా ఆస్వాదించారో, త్రీడీలో అంతకంటే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అన్నారు.
