కంచనపల్లి నుంచి కొత్తవాడకు ...తివాచీల వలస కథ.. కార్మికులకు కొరవడిన ప్రోత్సాహం

కంచనపల్లి నుంచి కొత్తవాడకు ...తివాచీల వలస కథ.. కార్మికులకు కొరవడిన ప్రోత్సాహం

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన కంచనపల్లి తివాచీలు నేడు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పత్తి, ఉన్ని, సహజ రంగులతో రూపొందించే ఈ తివాచీలు అందమైన ఆకృతులు మన్నికతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఒకప్పుడు ఇంటి గడపను, దేవాలయ మండపాలను, రాజవంశాల అతిథి గృహాలను అలంకరించిన కంచనపల్లి తివాచీలు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

మొఘల్ కాలం నాటి నుంచి మూలాలు

కంచనపల్లి తివాచీలకు మూలాలు శతాబ్దాల కిందటే ఉన్నాయి. దక్కన్ ప్రాంతంలో మొఘల్ కాలం నాటి కార్పెట్ నేయు సంప్రదాయాలు కంచనపల్లి కళాకారుల చేతుల్లో కొత్త రూపు దాల్చాయి. వరంగల్ ప్రాంతంలో పత్తి విస్తారంగా లభించడం, నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులు ఉండటం వల్ల ఈ పరిశ్రమ గ్రామీణ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. తరతరాలుగా కుటుంబాల నుంచి కుటుంబాలకు ఈ కళ వారసత్వంగా సంక్రమించింది.

తివాచీ నేయడంలో...

ఒక తివాచీ తయారీ వెనుక అనేక దశలు ఉంటాయి. ముందుగా నూలుకు రంగులు అద్దడం, డిజైన్ రూపొందించడం, మగ్గం సిద్ధం చేయడం, ఆ తర్వాత నేయడం జరుగుతుంది. పిట్​లూమ్, ఫ్రేమ్​లూమ్ వంటి సంప్రదాయ మగ్గాలపై కార్మికులు గంటల తరబడి శ్రమించి ఒక్కో తివాచీని నేస్తారు. ప్రతి డిజైన్‌లో కళాకారుడి సృజనాత్మకత, అనుభవం ప్రతిబింబిస్తుంది. తివాచీ నేసే ప్రక్రియలో మహిళల పాత్ర ఎంతో కీలకం. నూలు సిద్ధం చేయడం, రంగులు అద్దడం, మగ్గానికి దారాలు అమర్చడం వంటి అనేక పనుల్లో వారు పాల్గొంటారు.

నాటి తివాచీలు నేసిన మగ్గాలు నేడేవి?

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో గతంలో 200 మంది మగ్గాలపై చేనేత కార్మికులు రంగురంగుల నాణ్యమైన తివాచీలను నేస్తుంటే గ్రామంలో  సందడిగా ఉండేది. నాడు దేశ, విదేశాల్లోనూ కంచనపల్లి తివాచీలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. 

యంత్రాలతో తయారయ్యే చౌకధరల కార్పెట్లు మార్కెట్‌ను ఆక్రమించడంతో చేతితో నేసిన తివాచీలకు డిమాండ్ తగ్గిపోయింది. ముడిసరుకు ధరలు పెరగడం, చేత్తో మగ్గంపై నేసిన తివాచీలకు సరైన మార్కెటింగ్ లేకపోవడం, నాడు పనిచేసిన చేనేత కార్మికులు వృద్ధులవడం, యువత ఇతర ఉపాధి అవకాశాల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ కళకు వారసులు లేకుండా పోయారు. దీంతో నాడు తివాచీలు నేసిన మగ్గాలు మూలనపడ్డాయి.

కార్మికులకు కొరవడిన ప్రోత్సాహం

ఒకప్పుడు వందలాది తివాచీ మగ్గాల శబ్దాలతో మారుమోగిన కంచనపల్లి నేడు నిశ్శబ్దంగా మారింది. ‘‘కంచనపల్లి చేనేత కార్మికుల సంఘంలో గతంలో 200 మంది సభ్యులు ఉండగా, ప్రస్థుతం 76 మందికి తగ్గింద’’ని సొసైటీ అధ్యక్షుడు రాపోలు రామ్మూర్తి చెప్పారు. మరో వైపు ఉపాధి కోసం కంచనపల్లిలో తివాచీలు నేసిన నేత కార్మికులు పట్టుచీరలు నేయడం వైపు దారి మళ్లారు.

 ప్రస్థుతం కంచనపల్లి గ్రామంలో నాడు తివాచీలు నేసిన చేనేత కార్మికులు పోచంపల్లి పట్టుచీరలు నేస్తూ బతుకు బండి లాగిస్తున్నారు. 76 మంది చేనేత కార్మిక సంఘ సభ్యుల్లోనూ చాలామంది వృద్ధాప్యంతో మగ్గాలు నేయలేకపోతున్నారు. 

దీంతో కంచనపల్లిలో అనాదిగా వస్తున్న తివాచీలకు స్వస్థి పలికి ఉపాధి కోసం15 చేనేత కుటుంబాలు పోచంపల్లి పట్టు చీరలు నేస్తున్నారని రామ్మూర్తి చెప్పారు. కొన్నాళ్లు కాటన్ చీరలు నేసినా కూలీ గిట్టుబాటు కాకపోవడంతో పట్టుచీరల వైపు మళ్లామని ఆయన పేర్కొన్నారు. జీఐ ట్యాగ్​తోపాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తివాచీలు నేసిన చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక ఈ  కళ అంతరించిపోయే పరిస్థితి నెలకొందని రామ్మూర్తి చెప్పారు.  

తివాచీల నుంచి పోచంపల్లి పట్టుచీరల దాకా...

‘‘కంచనపల్లి గ్రామంలో తాను గతంలో తివాచీలు నేశానని, కానీ వాటికి మార్కెటింగ్ లేక తివాచీల స్థానంలో పోచంపల్లి పట్టుచీరలు నేస్తూ పొట్ట పోసుకుంటున్నాన’’ని చెప్పారు చేనేత కార్మికుడు అమృతం లక్ష్మీనారాయణ. ‘‘పోచంపల్లి నుంచి కట్టిన డిజైన్లు, టై అండ్ డై ప్రకారం తాము పట్టు చీరలు నేస్తున్నామని, ఒక్కో చీర నేసేందుకు నాలుగు రోజులు పడుతుంద’’ని మరో చేనేత కార్మికుడు అమృతం చంద్రయ్య చెప్పారు. ఇంటిల్లిపాది మగ్గంపై నెలంతా పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని చంద్రయ్య ఆవేదన చెందారు.

కంచనపల్లి కార్పెట్లు కొత్తవాడకు..

సంప్రదాయం, శ్రమ, సృజనాత్మకతకు ప్రతీక అయిన కంచనపల్లి తివాచీల కళ అంతరించిపోకుండా కాపాడేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్, రూరల్ డెవలప్​మెంట్​ (నాబార్డు) ముందుకు వచ్చి వరంగల్ నగరంలోని కొత్తవాడలో 50 మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. 

ఎం– సువిధ ప్రాజెక్టు కింద నాబార్డు సహకారంతో శిక్షణ పొందిన మహిళలు తివాచీలు నేస్తూ ఉపాధి పొందుతున్నారు. అమ్మా, నాన్నతోపాటు తాను తివాచీలు నేస్తూ నెలకు రూ.10వేల ఆదాయం పొందుతున్నానని వరంగల్​కు చెందిన నేత కార్మికురాలు కంచ సమత చెప్పారు. 

కంచనపల్లిలో పుట్టిన తివాచీల కళ వరంగల్ నగరంలోని కొత్తవాడకు మారింది. మార్కెట్ సమస్యలు, ఉపాధి అవకాశాల కోసం వలసలు వంటి కారణాలతో పలువురు చేనేత కార్మికులు వరంగల్​లోని  కొత్తవాడ ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగించినట్లు స్థానిక చరిత్రకారులు పేర్కొంటారు. కొత్తవాడలో మాత్రం కొన్ని సంప్రదాయ కార్పెట్ నేసే కుటుంబాలు, ఇటీవల నాబార్డు శిక్షణ పొందిన మహిళలు తివాచీలను నేస్తున్నారు.

తివాచీలకు జీఐ ట్యాగ్

కంచనపల్లి తివాచీలు కొత్తవాడకు మారాక వరంగల్ దుర్రీలనే పేరు వచ్చింది. ఈ తివాచీలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. దీంతో ఈ కళకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చింది. జీఐ ట్యాగ్ కారణంగా అసలైన ఉత్పత్తులకు మార్కెట్‌లో ప్రత్యేక విలువ పెరిగినా వరంగల్​లో నేత కార్మికుల సంఖ్య తగ్గింది. మగ్గం మీద నూలుపోగులు కదిలితే రంగుల కథలు పుడతాయి. 

కంచనపల్లి గ్రామంలోని కళాకారుల చేతుల్లో పత్తి దారాలు అద్భుతమైన తివాచీలుగా రూపుదిద్దుకుంటాయి. ఒకప్పుడు రాజభవనాల నేలను అలంకరించిన ఈ తివాచీలు విదేశీ గృహాల అందాన్ని పెంచుతున్నాయి. సంప్రదాయం, సృజనాత్మకత, శ్రమ కలగలిపిన తెలంగాణ కళా వారసత్వానికి కంచనపల్లి తివాచీలు నిలువెత్తు నిదర్శనంగా ఉండేవి.

విదేశాల్లోనూ తెలంగాణ ముద్ర

ఒకప్పుడు గ్రామీణ గృహాలకు పరిమితమైన వరంగల్ తివాచీలు నేడు యూరప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌లో సహజమైన, చేతిపనితో తయారైన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ వరంగల్ తివాచీలకు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతోంది. జూట్, ఉన్ని, పత్తి కలయికతో రూపొందించిన ఆధునిక నమూనాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. 

కంచనపల్లి తివాచీ అనేది కేవలం నేలపై పరుచుకునే వస్తువు కాదు. అది తెలంగాణ సంస్కృతి, గ్రామీణ కళాకారుల నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతకు ప్రతీక. మగ్గం మీద నేసిన ప్రతి రంగు పోగు వెనుక ఒక కుటుంబం ఆశలు, ఒక గ్రామం చరిత్ర, ఒక రాష్ట్రం కళా వారసత్వం దాగి ఉంది. ఈ కళను కాపాడటం అంటే తెలంగాణ ఆత్మను కాపాడినట్టే.