చాలా రోజులుగా వర్షం కోసం ఎదరుచూసిన జంతువులను సంతోష పెట్టేలా అడవిలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. కుండపోతగా మారిన వర్షానికి గాలి తోడైంది. అడవిలో చెట్టూ పుట్ట, ప్రాణులన్నీ చినుకుల చల్లదనంతో సేద తీరాయి. జంతువులన్నీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు ఇది. కానీ, చెట్టుపై గూడు కట్టుకున్న పిచ్చుకమ్మ మాత్రం కంగారుపడుతోంది. తన పిల్లల్ని గూడులో వదిలేసి ఆహారం కోసం వచ్చింది. తిరిగి పిల్లల దగ్గరకు వెళ్దామనుకునే సరికి విపరీతమైన
గాలి, వాన. “దేవుడా.. నా పిల్లలకి ఎటువంటి ఆపదా రాకుండా చూడు" అని మనసులోనే వేడుకుంది పిచ్చుకమ్మ. గూట్లో ఉన్న పిచ్చుక పిల్లలు బయట జోరుగా పడుతున్న వర్షానికి భయపడకుండా అమ్మ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాయి. ఇంతలోనే పిచ్చుకమ్మ గూడు కూలిపోయింది.
వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న గూడును చూసింది ఓ గద్ద. “అయ్యో... పిచ్చుకమ్మ పిల్లలు వర్షానికి తడిసిపోతున్నాయి” అనుకుంటూ ఎగురుతూనే తన విశాలమైన రెక్కల్ని చాపింది. కొట్టుకుపోతున్న గూడుపై గొడుగులా నిలిచింది. పిల్లలకు ధైర్యం చెప్పింది. నీటి ప్రవాహం తగ్గిన చోట గూడు ఆగింది. వర్షం ఉధృతి కూడా తగ్గింది. ఇంతలోనే తన పిల్లల జాడ వెతుక్కుంటూ పిచ్చుకమ్మ వచ్చింది. తన పిల్లలు క్షేమంగా ఉండటం చూసి సంతోషించింది. కానీ, పిల్లల పక్కన ఉన్న గద్దను చూసి భయపడింది.
పిచ్చుకమ్మ భయాన్ని గమనించిన గద్ద, "నువ్వేమీ భయపడకు. నీ పిల్లలకు ఎటువంటి హాని తలపెట్టను. నువ్వు కూడా నా రెక్కల కిందకు వచ్చి తలదాచుకో” అంది. పిచ్చుకమ్మ పిల్లలు అమ్మతో "అమ్మా.. ఈ గద్ద చాలా మంచిది. మేం నీళ్ళల్లో పడిపోతే మాకు రక్షణగా నిలిచింది" అన్నాయి.
"మిత్రమా.. నువ్వు చేసిన సాయం నేను ఎన్నటికీ మరువలేను. మమ్మల్ని ఆహారంగా తీసుకునే జాతి నీది. అయినా అక్కున చేర్చుకుని నా పిల్లల్ని కాపాడావు. దేవుడు పంపిన మిత్రుడివి నువ్వు" అంది పిచ్చుకమ్మ గద్దతో.
ALSO READ : ఆధ్యాత్మికం : ధర్మదీపం.. జీవితం ఏమిటి.. ఎన్నాళ్లు మోస్తావు?
“పిచ్చుకమ్మా... నా పిల్లలు కూడా ఇలాగే ఓ పాముకు ఆహారం అయ్యారు. పిల్లలు పోతే తల్లి మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అందుకే ఏజాతి పక్షి పిల్లలైనా నాకు మక్కువే. వర్షం కూడా వెలిసింది. మరో సురక్షిత ప్రాంతంలో గూడు కట్టుకుని సంతోషంగా ఉండు. ఇక నుండి మన స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దాం” అంది.
