చేతన్, ప్రకాశ్ అనే ఇద్దరు యువకులు ఒక చిన్ననది ఒడ్డున నడుస్తున్నారు. వాళ్లిద్దరినీ అక్కడ కనిపిస్తున్న ఒక దృశ్యం ఆకర్షించింది. పల్లెటూరి పడుచు నదీతీరానికి కొంత దూరంలో కూర్చొని ఏడుస్తూ ఉంది. చేతన్ ఆమె దగ్గరకు వెళ్లి 'ఎందుకు ఏడుస్తున్నావమ్మా?' అని అడిగాడు. ఆమె తల ఎత్తి అతని వైపు అమాయకంగా చూసి మా ఊరు ఆ వైపు పొద్దున పని మీద ఈ వైపు వచ్చాను.
అప్పుడు నీళ్లు మోకాలిలోతు కూడా లేవు. పని ముగించుకొని ఇప్పుడు వచ్చి చూస్తే నీళ్లు నిండుగా ప్రవహిస్తున్నాయి. నాకు ఈత రాదు. మా ఊరికెట్లో పోయేది? భయంగా ఉంది!" అన్నది. "నువ్వేం భయపడకు. నేను నిన్ను ఆ వైపు చేరుస్తాను. నాకు ఈత బాగా వచ్చు. ఈదాల్సిన అవసరం ఉండదు. మహా అంటే ఈ నీళ్లు భుజాల వరకు రావచ్చు అంతే!" అన్నాడు చేతన్.
ప్ర కాశ్ వైపు తిరిగి అతడ్ని అక్కడే ఉండమని చెప్పి ఆమెను నడిపించుకొని నదిలోకి దిగాడు చేతన్. కానీ, ఆమె నదిలోకి అడుగు పెట్టడానికే చాలా భయపడింది. వేరే చేసేదేం లేక ఆమెను తన భుజం మీద ఎత్తుకుని మెల్లగా అడుగులు ముందుకు వేస్తూ నదిని దాటాడు. అప్పటికే సూర్యుడు అస్తమించాడు.
మెల్లగా చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆమెను భుజం మీది నుంచి దించి "అమ్మా ఇక వెళ్లగలవా మీ ఊరికి?" అని అడిగాడు. "నాకు భయంగానే ఉంది. మా ఊరు అదిగో అక్కడ కొండ పక్కన" అని ఆమె చేయి ఎత్తి చూపించింది. “సరే మీ ఊరి వరకు తోడుగా వస్తాను పద" అని చెప్పి ఆమెతో పాటు పొలాలలో నడుచుకుంటూ చివరికి ఆ పల్లెలో వదిలిపెట్టి వెనుదిరిగాడు.
ALSO READ : 70:15:15 ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా..
తన స్నేహితుడు ఉన్న చోటుకి వచ్చేటప్పటికి బాగా చీకటిపడింది. అతడక్కడే ఉన్నాడు.. ఇతగాడిని చూసీచూడగానే' అరే చేతన్! తిరిగి క్షేమంగా వచ్చావా? నారదరుషిలా కాపురం పెట్టావేమో అనుకున్నా!" అన్నాడు. దానికి సమాధానంగా ఆలస్యం ఎందుకైందో వివరించాడు. తర్వాత అక్కడి నుంచి ఇద్దరూ తమ ఆశ్రమానికి బయలుదేరారు.
మన జీవితం ఏంటి?
వాళ్లు మౌనంగా నడుస్తున్నారు. ఉన్నట్టుండి. ప్రకాశ్ ఇలా అన్నాడు " బ్రదర్, నువ్వలా చేసి ఉండకూడదు. వాటీజ్ అవర్ లైఫ్? ఆడవాళ్లను చూడనైనా చూడకూడదు కదా మనం? కానీ, ఈ రోజు నువ్వు చేసిందేమిటి? ఎంత పొరపాటు జరిగిందో చూడు. యవ్వనంలో ఉన్న స్త్రీని భుజం మీద మోసుకొని వెళ్లడమా? మొన్న ఒక పుస్తకంలో చదివాను. ఆనందుడు బుద్ధుడ్ని 'స్త్రీల విషయంలో ఎలా మెలగాలి' అని అడుగుతాడు. దానికి బుద్ధుడు సమాధానమిస్తూ 'వాళ్లని చూడనే చూడకు' అంటాడు. వాళ్లని చూడకుండా. ఉండటానికి ఎలా సాధ్యమవుతుంది? సమాజంలో సగం మంది వాళ్లూ ఉన్నారు కదా!" అని మళ్లీ అడుగుతాడు ఆనందుడు. 'సరే వాళ్లతో మాట్లాడవద్దు' అని బుద్ధుడు చెప్తాడు దానికి సమాధానంగా. 'ఎందరో స్త్రీలు మీ దర్శనానికి వస్తుంటారు. నేను మీ సేవకుడ్ని కచ్చితంగా వాళ్లతో మాట్లాడాల్సిన సందర్భాలెన్నో ఏర్పడుతుంటాయి. ఎలా?' అని అడుగుతాడు. "అయితే మాట్లాడాల్సిన అవసరం వస్తే మాట్లాడు. కానీ, జాగ్రత్తగా ఉండు' అని చెప్తాడు బుద్ధుడు. ఈ రోజు నువ్వు చేసిందేంటి? ఎంత అజాగ్రత్త! ఎంత అజాగ్రత్త!" అంటాడు.
జాగ్రత్తగా ఉన్నా..
ప్రకాశ్ మాటలు విన్న తర్వాత చేతన్ ఇలా అన్నాడు "నేను ఆ బుద్ధుడి కథ చదవలేదు. కానీ, బుద్ధుడు చెప్పినట్టే నేను జాగ్రత్తగా ఉన్నాను. నీళ్లలో నడుస్తున్నప్పుడు జారి కిందపడకుండా అడుగులు వేసే ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా ఉన్నానో.. అదే విధంగా ప్రతిక్షణం మనసు కదలికలను కనిపెడుతూ జాగ్రత్త వహించాను. కాబట్టే తిరిగి క్షేమంగా రాగలిగాను. వట్టి చేతులతో తిరిగి రాలేదు. భయాందోళనలతో కుమిలిపోతుండిన ఒక దీనురాలిని భద్రంగా ఇల్లు చేర్చి పుణ్యఫలంతో తిరిగి వచ్చాను."
భావవికారాలు...
అలా మాట్లాడుకుంటూ స్నేహితులిద్దరూ ముందుకు నడక సాగించారు. కొద్దిసేపటి మౌనం తర్వాత "మిత్రమా! ఆమెను నీ భుజం మీద మోసుకొని వెళ్తున్నప్పుడు నీలో ఏమీ భావవికారాలు చెలరేగలేదా? నేను నమ్మలేకపోతున్నాను!"అంటాడు ప్రకాశ్. మళ్లీ చేతన్ దానికేం బదులు చెప్పలేదు. ఇంక ఐదు నిమిషాలు అయితే తమ ఆవాసానికి చేరుకుంటారు. ఉన్నట్టుండి ప్రకాశ్ మళ్లీ అడిగాడు "బ్రదర్! భుజం మీద నువ్వు మోసుకొని వెళ్తున్నప్పుడు ఆమె నీతో ఏమీ మాట్లాడలేదా?". దానికి సమాధానంగా చేతన్"ప్రకాశ్! నేను ఆవిడను భుజం మీద మోసింది మూడు నిమిషాలే! నీవింకా ఎన్నాళ్లు ఆమెను మనసులో మోస్తూ తిరగబోతున్నావు?"అని మెల్లగా మృదువుగా వీణానాదంలాగ పలికిన ఆ పలుకులు ఆ నిశ్శబ్ధవాతావరణంలో ప్రకాశ్ చెవులకు పిడుగు పడినట్టు. గట్టిగా గంభీరంగా పలికినట్టనిపించింది!!
కర్టసి- ధర్మదీపం ఆర్గనైజేషన్
