అమెరికాకు చెందిన ఓ ప్రముఖ బ్యాంక్ భారత్‌లో పనిచేస్తున్న తమ కస్టమర్ సర్వీస్ ఉద్యోగులపై వేటు వేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జస్ట్ 5 నిమిషాల గూగుల్ మీట్ వీడియో కాల్‌లో మెుత్తం 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. రెడిట్ వేదికగా 'r/IndianWorkplace' కమ్యూనిటీలో ఓ ఉద్యోగి పంచుకున్న ఈ వివరాలు ప్రస్తుతం కార్పొరేట్ అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని ప్రైవేటు ఉద్యోగాలతో కష్టమే అంటున్నారు నెటిజన్లు.
సాధారణంగా సాయంత్రం 6:30 గంటల షిఫ్ట్‌లో పనిచేసే సిబ్బందిని ఆ రోజు ఆపరేషనల్ కారణాల రీత్యా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కంపెనీ చెప్పిందని ఉద్యోగి వెల్లడించాడు. ఆ తర్వాత రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సీనియర్ మేనేజ్‌మెంట్ నుంచి అకస్మాత్తుగా ఒక గూగుల్ మీట్ లింక్ వచ్చింది. ఆ మీట్‌లోకి లాగిన్ అయిన వెంటనే, ఉద్యోగులందరి సర్వీసులు ముగిశాయని.. తక్షణమే తొలగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కేవలం 5 నిమిషాల్లో ముగిసిన ఈ సమావేశంతో మొత్తం 80 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
పనితీరు సరిగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చెబుతున్నప్పటికీ.. ఆ వాదనను ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. ఒకేసారి మొత్తం టీమ్‌ను తొలగించడం వెనుక అసలు కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ వర్కింగ్ కల్చర్ పెరిగిన తర్వాత కంపెనీలు ఇలా సామూహిక లేఆఫ్స్‌కు పాల్పడటం ఆందోళనకరమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై సంబంధిత అమెరికా బ్యాంక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఒక రెడిట్ పోస్ట్ ఆధారంగానే ఈ సమాచారం బయటకు వచ్చినప్పటికీ.. గ్లోబల్ కంపెనీల్లో కస్టమర్ సర్వీస్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత ఎంత అనిశ్చితంగా ఉందనే చర్చకు ఈ ఘటన మరోసారి కళ్లకు కడుతోంది.
