వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ తన శతాబ్దాల నాటి ప్రత్యేకతను, గుర్తింపును కాపాడుకునేందుకు కీలక అడుగులు వేస్తోంది. టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీని స్టాక్ మార్కెట్లలో పబ్లిక్ లిస్టింగ్ చేయాలనే డిమాండ్లు వస్తున్న వేళ.. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. టాటా గ్రూప్ మూలాలను, ప్రజా ప్రయోజన తత్త్వాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యకైనా తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 11, 2026న పంపిన కమ్యూనికేషన్‌కు స్పందనగా లిస్టింగ్ ఒక్కటే మార్గం కాదని.. ఇతర అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని బోర్డును కోరారు నోయెల్ టాటా.
సెప్టెంబర్ 17, 2026న జరిగిన టాటా సన్స్ బోర్డు మీటింగ్‌లో కూడా నోయెల్ టాటా ఈ అంశాన్ని ప్రస్తావించారు. టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి ట్రస్ట్స్ ఎప్పుడూ అంగీకరించలేదని మరోసారి తేల్చిచెప్పారు. రిజర్వు బ్యాంక్ సూచనల నేపథ్యంలో కేవలం పబ్లిక్ లిస్టింగ్ మార్గాన్నే ఎంచుకోకుండా.. చట్టపరమైన అన్ని ఇతర ప్రత్యామ్నాయాలను కూలంకషంగా అన్వేషించాలని సమావేశం ఒక అంగీకారానికి వచ్చింది.
మార్చి 2024 నాటి తీర్మానం..
టాటా సన్స్ ఎప్పుడూ అన్‌లిస్టెడ్‌గానే ఉండాలనేది తమ స్థిరమైన అభిప్రాయమని ట్రస్ట్స్ పేర్కొంది. దివంగత రతన్ టాటా సమక్షంలో మార్చి 2024లో టాటా సన్స్ బోర్డు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత జూలై 2025లో సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ కూడా ఇదే విషయమై ప్రత్యేక తీర్మానాలను ఆమోదించాయి. టాటా గ్రూప్ ప్రస్తుత యజమాన్య నిర్మాణాన్ని, దాని ప్రత్యేకతను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ట్రస్ట్స్ వెల్లడించాయి.
టాటా ఆపరేటింగ్ మోడల్ ప్రత్యేకత..
టాటా గ్రూప్ కేవలం వ్యాపార సంస్థ మాత్రమే కాదని.. అది దేశ సేవ కోసం ఏర్పడిన ఒక మహోన్నత వేదిక అని నోయెల్ టాటా పేర్కొన్నారు. మెజారిటీ వాటా కలిగిన ట్రస్ట్స్ తమకు వచ్చే డివిడెండ్ల ద్వారా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సెంటర్లను నిర్వహిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాయని గుర్తు చేశారు. స్వచ్ఛమైన వాణిజ్య దృక్పథం మాత్రమే కాకుండా.. ప్రజా శ్రేయస్సే ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని చెప్పారు. ఒకవేళ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తే ఈ ప్రత్యేకమైన స్వభావం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ : షాపూర్జీ పల్లోంజీ వాటాలపై టాటా ట్రస్ట్ గురి..
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు..
ఈ మొత్తం అంశం కేవలం ఆర్థిక పరమైన, నియంత్రణ సంస్థల రూల్స్ కి సంబంధించినది మాత్రమే కాదని, సంస్థ ఆత్మను రక్షించుకునే పోరాటమని ట్రస్ట్స్ అభిప్రాయపడ్డాయి. ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ.. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన మార్గాలను అన్వేషించేందుకు టాటా ట్రస్ట్స్ కట్టుబడి ఉంది.
