భారత్ రాబోయే కాలంలో భారీ జనాభా మార్పును ఎదుర్కోబోతోంది. 2050 నాటికి దేశ జనాభాలో దాదాపు 5వ వంతు.. అంటే సుమారు 35 కోట్ల మంది 60 ఏళ్లు పైబడినవారే ఉండనున్నారు. ఈ లెక్కన ప్రతి 5 మందిలో ఒకరు వృద్ధులే ఉంటారు. వీరిలో దాదాపు 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసించే అవకాశం ఉందని ట్రాన్స్‌ఫార్మ్ రూరల్ ఇండియా లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. దేశం సంపన్నంగా మారకముందే వృద్ధాప్య దశలోకి ప్రవేశిస్తుండటం ప్రధాన సవాలుగా మారనుంది.
కుటుంబాలపై సంరక్షణ భారం
రానున్న కాలంలో వస్తున్న మార్పులు వృద్ధుల సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫ్యామిలీస్ చిన్నవిగా మారడం, యువత ఉపాధి కోసం పట్టణాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, ఆయుర్దాయం పెరగడం వంటి కారణాలతో ఫ్యామిలీ సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం వృద్ధుల సంరక్షణలో దాదాపు 94 శాతం కుటుంబాల్లోనే జరుగుతోంది. 2001లో ప్రతి వృద్ధుడికి 8.4 మంది పని వయసు వారు ఉండగా, 2026 నాటికి ఈ సంఖ్య సగటున 5.2కి పడిపోనుందని నివేదిక అంచనా వేసింది.
మహిళలపైనే అధిక భారం..
ఎలాంటి పేమెంట్ లేని సంరక్షణ పనుల్లో లింగ అసమానత కూడా తీవ్రంగా ఉంది. మహిళలు రోజుకు సగటున 305 నిమిషాలు సంరక్షణ బాధ్యతలకు కేటాయిస్తుండగా.. పురుషులు కేవలం 56 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నారు. ఈ అసమానత మహిళల ఉద్యోగ, ఆర్థిక అవకాశాలను పరిమితం చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా వేడి గాలులు, వరదలు వంటి విపత్తులు సంరక్షణ అవసరాలను పెంచుతూ మహిళలపై అదనపు భారాన్ని మోపుతున్నాయని నివేదిక పేర్కొంది.
దీర్ఘకాలిక వ్యాధులతో సవాలు..
భారత్‌లో ఆరోగ్య సమస్యల స్వరూపం కూడా మారుతోంది. దేశంలో నమోదవుతున్న మరణాల్లో దాదాపు మూడింట రెండొంతులు మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగానే జరుగుతున్నాయి. వృద్ధాప్యంతో పాటు వైకల్యంతో జీవించే కాలం పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆరోగ్య వ్యవస్థ ప్రధానంగా ప్రసవాలు, టీకాలు, తక్షణ అనారోగ్యాల వంటి స్వల్పకాలిక అవసరాలపై దృష్టి పెట్టింది. దీర్ఘకాలిక సంరక్షణకు కొత్త విధానం అవసరమని TRI సూచించింది.
ALSO READ : ఆలయాల్లో విఐపీ దర్శనాలు, సెల్ ఫోన్ వాడకంపై.
గ్రామాల్లోనే ‘కేర్ ఎకోసిస్టమ్’..
ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు TRI ‘నెయిబర్‌హుడ్ ఆఫ్ కేర్’ విధానాన్ని ప్రతిపాదించింది. అంటే గ్రామ పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను అనుసంధానించి ప్రతి ఫ్యామిలీకి జస్ట్ నడిచి వెళ్లే దూరంలో సమగ్ర సంరక్షణ అందించాలన్నది దీని లక్ష్యం. కేర్ ఎకానమీలో జీడీపీకి 2 శాతం పెట్టుబడి పెడితే సుమారు కోటి 10 లక్షల ఉద్యోగాలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు, కల్పించవచ్చని నివేదిక అంచనా వేసింది. వృద్ధులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, గౌరవంగా జీవించేలా గ్రామస్థాయిలోనే సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం భవిష్యత్తు భారత్‌కు కీలకం.
