అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు భారత్ అధికారికంగా పేర్లు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఈ పేర్లను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాపుల్లో చేర్చనున్నారు. ఇందులో భూభాగాలతో పాటు నాలుగు పర్వత మార్గాలు, ఒక సరస్సు, ఒక స్మారక చిహ్నం ఉన్నాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పేర్లను అధికారికంగా గుర్తించడం ద్వారా ఆయా ప్రాంతాలకు స్పష్టమైన గుర్తింపు లభిస్తుంది. దీంతోపాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పదేపదే చైనీస్ పేర్లు పెట్టడాన్ని భారత్ వ్యతిరేకిస్తున్న క్రమంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కొత్తగా గుర్తించిన 27 పేర్లలో లాంగ్జు, మజా, బిసా, జో-లా, రిజా-లా, పుకుర్-లా, థాగ్-లా, శంభో సరోవర్, బారా కుందున్, ఛోటా కుందున్, ధన్ బారీ, జైరాంపూర్, రామ్‌నగర్, జస్వంత్ గర్ తదితరాలు ఉన్నాయి. జో-లా, రిజా-లా, పుకుర్-లా, థాగ్-లా పర్వత మార్గాలు కాగా శంభో సరోవర్ సరస్సుగా గుర్తించారు.
ALSO READ : ఆలయాల్లో విఐపీ దర్శనాలు, సెల్ ఫోన్ వాడకంపై..తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంటూ తనదిగా చెప్పుకుంటోంది. అయితే భారత్ ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. గతంలో చైనా అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టినప్పటికీ.. వాటి వల్ల భూభాగంపై భారత్ సార్వభౌమాధికారంలో ఎలాంటి మార్పు ఉండదని భారత్ స్పష్టం చేసింది.
