మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సూపర్ హిట్ చిత్రం ‘ఒక్కడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2003లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని జూన్ 26న 4కే వెర్షన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రీ- రిలీజ్ చేయనున్నారు. రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామ కృష్ణ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలుమార్లు రీ- రిలీజ్ అయినప్పటికీ ‘ఒక్కడు’కు ప్రతి ఏడాది క్రేజ్ మరింత పెరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. 4కేలో సినిమా విడుదల కావడం పట్ల తాను కూడా ప్రేక్షకుల మాదిరిగానే ఎంతో ఎక్సయిటింగ్‌గా ఉన్నానని చెప్పారు. ప్రేక్షకులంతా మరోసారి థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆస్వాదించి ఆదరించాలని కోరారు. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, భూమిక జంటగా నటించగా, ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో మెప్పించారు.
