ఆధునిక భారత సాహిత్య చరిత్రలో ‘దేవదాసు’ ఒక సంచలనం. బెంగాల్ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన ఈ నవల ఎంత పేరు తెచ్చుకుందో సినిమాగానూ మారి అంతే ఖ్యాతి పొందింది. ఈ నవల ఆధారంగా 20కి పైగా ‘దేవదాసు’ సినిమాలు రావడం ఒక రికార్డు. ఇక, ఒరిజినల్ నవల అనేక భాషల్లోకి అనువాదం కాగా అందులోని కథాంశాన్ని స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకుని వేర్వేరు రచనలు కూడా వచ్చాయి. అలాంటిదే ‘తెలంగాణ దేవదాసు’ నవల. కాకపోతే, ఇది ‘దేవదాసు’ సినిమా ప్రభావంతో రూపుదిద్దుకున్నది. రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య.
గడీల కాలంలో దొరల బిడ్డకు, సాధారణ యువకుడికి మధ్య మొలకెత్తిన ప్రేమ చివరికి ఏమైందన్నదే ఈ నవల ఇతివృత్తం. వాస్తవానికి పుస్తకం పేరుతోనే సగం కథాంశం తెలిసిపోతున్నప్పటికీ అది కేవలం అంతవరకు మాత్రమే పరిమితం. ఎందుకంటే చిత్రణతోపాటు కథా గమనం, పాత్రల తీరుతెన్నులు, కాలమాన పరిస్థితులు అన్నీ విభిన్నం.
నిజాం నిరంకుశ పాలనకు మడుగులొత్తిన గడీలు పాపాల పుట్టలు. అక్కడ జరగని అకృత్యాలు, అన్యాయాలు లేవు. నిజాం పాలన నుంచి విముక్తి కలిగినా, దొరల దురాగతాలు మాత్రం ఆగలేదు. వీటిపై అప్పుడప్పుడే ప్రజల్లో తిరుగుబాటు వస్తున్న రోజుల్లో మొదలవుతుంది ఈ ‘తెలంగాణ దేవదాసు’ ప్రస్థానం.
పాలేరుగా పనిచేసి, కాలక్రమంలో కొంత పొలం కొని బతుకు వెళ్లదీస్తున్న ఓ సాధారణ వ్యక్తి కొడుకు గడీ లోపలికి ఎలా వెళ్లగలిగాడు? చిన్నదొర్సాని ప్రేమను మొదట ఎందుకు తిరస్కరించాడు? ఆ తర్వాత ఎందుకు అంగీకరించాడు? అందరినీ ఎదిరించైనా తనను పెళ్లి చేసుకోమని కోరిన చిన్నదొర్సాని.. మళ్లీ ఎందుకు మనసు మార్చుకుంది? ఆ బాధలో ప్రేమికుడు దేవదాసుగా మారాడా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తెలంగాణలోని నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా చెప్పిన సమాధానాలను ఈ నవలలో తెలుసుకోవచ్చు.
ఈ పుస్తకంలోని పాత్రలన్నీ సహజంగా ఉన్నాయి. చెల్లెలి ప్రేమకు మొదట అండగా నిలిచిన అన్న ఆ తర్వాత దూరం జరగడం మొదలుకొని, ప్రేమను వద్దనుకొని తిరిగి కావాలనుకునే కథానాయకుడి వరకు అన్ని పాత్రలు పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ప్రవర్తించేవే. అలాగే దొర, చిన్నదొర్సాని, మరో ఉదాత్త పాత్ర తీరు సైతం ఇలాగే కనిపిస్తాయి.
ముగింపును పాఠకుడు ముందే ఊహించగలిగినా, దానిని, ఒప్పించేలా చెప్పారు రచయిత. శరత్ దేవదాసులోని విషాదాంతాన్ని తెలంగాణ సమాజంలోని ధనిక – పేద వ్యత్యాసాలు, కులం, ఆధిపత్యం కోణాల్లో చూపారు. ముగింపు అర్థవంతంగా ఉంది. జీవితాన్ని అందంగా మలచుకోవాలంటే ఏం చేయాలోఈ నవల అంతర్లీనంగా వివరిస్తుంది. ‘కాలానుగుణంగా మారితేనే మనుగడ’ అనే సందేశాన్ని ఇస్తుంది.
తన రచనల్లో తెలంగాణ మట్టి పరిమళం, మాండలికం, అణగారిన వర్గాల జీవితాలు, మహిళలు, రైతుల సమస్యలను ప్రస్తావించడంలో పేరొందిన రచయిత.. ఈ ‘తెలంగాణ దేవదాసు’ నవలలోనూ వాటిని స్పృశించారు. వివిధ కులాలు, వాళ్ల పనులు, సమస్యలను ప్రస్తావించారు. అలాగే గడీల్లోనూ మహిళలకు స్వేచ్ఛలో పరిమితులు ఉంటాయని వివరించారు. సన్న, చిన్న కారు రైతుల వెతలూ చూపారు.
భాష సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది. శైలి నవలకు కావల్సిన విధంగా ఉంది. ‘సవారెడ్ల బండ్లు’, ‘కోళ్లాగెల’, ‘కారెడ్డాలు’ వంటి స్థానిక పదాలు కనిపిస్తాయి.పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యం చుట్టూ నవల అల్లుకున్నప్పటికీ కథాగమనం అంతా మాండలికంలోనే కొనసాగదు. ‘స్వాతి’ మాసపత్రికలో అనుబంధ నవలగా రావడం వల్ల దానికి అనుగుణంగా ఈ మార్పు ఉన్నట్లు అనిపిస్తుంది. వ్యసనాలకు బానిసైన విషాదాంత ‘దేవదాసు’ జీవితం వద్దని, ‘చదువు’ను ఆయుధంగా మలచుకొని అభ్యుదయ పథంలో సాగాలని, బతుకులను మార్చుకోవాలని చెప్పే ఈ నవలను ప్రతి ఒక్కరూ చదవొచ్చు.
- జి. మహేశ్వర్
