తెలుగు సాహిత్యంలో సమకాలీన సామాజిక సమస్యలను సున్నితంగా, బాధ్యతాయుతంగా ప్రతిబింబించే కవుల్లో నందిని సిధారెడ్డి ఒకరు. ప్రజల జీవితాలతో, వారి బాధలతో, ఆశయాలతో తన సాహిత్యాన్ని ముడిపెట్టుకున్న ఆయన కరోనా మహమ్మారి నేపథ్యంగా రచించిన దీర్ఘకావ్యం “అనిమేష”. ఈ కావ్యానికి 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
అనిమేష కేవలం కరోనా కాలపు సంఘటనల సమాహారం మాత్రమే కాదు. మానవజాతి ఎదుర్కొన్న భయం, వేదన, నిస్సహాయత, ఆశావాదం, జీవన తత్వాన్ని ప్రతిబింబించే గొప్ప సాహిత్య కృతి. వరవరరావు ‘సముద్రం’ కావ్యం ఉద్యమానికి కేంద్రమైతే, నగ్నముని ‘కొయ్యగుర్రం’ దీర్ఘ కవిత దివిసీమ ఉప్పెనకు కేంద్రం.
అదేవిధంగా అనిమేష కావ్యం ప్రపంచాన్ని కమ్ముకుని ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన వికృత కొవిడ్‌కు కేంద్రం. మహాభారతం18 పర్వాల కావ్యమైతే కొవిడ్ నేపథ్యంలో సిధారెడ్డి రాసిన అనిమేష19 పర్వాల కావ్యం.
అనిమేష కొవిడ్ నేపథ్యంలో వచ్చిన మొట్టమొదటి కావ్యం. “అనిమేష” అంటే ‘రెప్పవాల్చని స్థితి’. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా భయాందోళనలకు గురై నిద్రలేని పరిస్థితిని ఎదుర్కొంది. ఆ అనుభూతిని ప్రతిబింబించేలా ఈ కావ్యానికి ఆ పేరు పెట్టడం ఎంతో సముచితం. కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.
మానవ సంబంధాలు దూరమయ్యాయి. జీవితం అనిశ్చితితో నిండిపోయింది. ఈ పరిస్థితులన్నింటినీ సిధారెడ్డి తన కవిత్వంలో అద్భుతంగా చిత్రించారు. అర్థవంతమైన శీర్షికలతో అద్భుతమైన శిల్పంతో సిధారెడ్డి తనదైనశైలిలో కావ్యాన్ని రచించాడు. వలస కూలీల నడకను, బాధలను కవిత్వీకరించిన విధానం మన కంట నీరు పెట్టిస్తుంది. “కరోనా వ్యాక్సిన్ వ్యాపారం భుజంమీద చేయివేసి కొత్త రూపం ఎత్తుతుంది” అని రాయడం కవి ముందు చూపుకు నిదర్శనం.
నందిని సిధారెడ్డి ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే కవి. నాలుగు దశాబ్దాలపాటు వివిధ సామాజిక, ప్రగతిశీల, తెలంగాణ ఉద్యమాలతో మమేకమైన ఆయన జీవిత అనుభవం “అనిమేష”లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల బాధలను తన బాధగా భావించి, సమాజానికి అవసరమైన సందేశాలను తన కవిత్వం ద్వారా అందించారు. కరోనా వల్ల ఏర్పడిన వివిధ రకాల బాధలను19 గాథలుగా విభజించి వివరించడం ఈ కావ్యం ప్రత్యేకత. ప్రతి గాథ ఒక ప్రత్యేకమైన వేదనను ప్రతిబింబిస్తుంది.
కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి దుఃఖం, అనుమానాల మధ్య మానవ సంబంధాల విచ్ఛిన్నం, ఆర్థిక సంక్షోభం, సామాజిక దూరం వంటి అనేక అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా “కడ చూపు కాకపోయినా, కడకు నిప్పు పెట్టడానికి వీలు కాకపోయినా..” వంటి పంక్తులు కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొన్న విషాదాన్ని హృదయ విదారకంగా వ్యక్తపరుస్తాయి.
సిధారెడ్డి కవిత్వంలో సామాజిక విమర్శ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా సమయంలో ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వాలు చప్పట్లు, గంటలు మోగించడం వంటి ప్రతీకాత్మక కార్యక్రమాలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. “చప్పట్లు కొడితే పక్షులు లేవయి, గంటలు మోగిస్తే ధైర్యం పలకదు” అనే పంక్తులు ప్రభుత్వ విధానాలపై ఆయన అసంతృప్తిని తెలియజేస్తాయి. అయితే ఈ కావ్యం కేవలం బాధను మాత్రమే చిత్రించలేదు. మానవజాతి ఎదుర్కొనే ప్రతి సంక్షోభాన్ని శక్తి మనిషిలో ఉందనే ఆశావాదాన్ని కూడా అందిస్తుంది.
విజ్ఞానం, వైద్యం, శాస్త్రీయ పరిశోధనలపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని కవి సూచిస్తారు. “ప్రపంచ సంరక్షణ ప్రపంచ దేశాల బాధ్యత” అనే భావన ద్వారా మానవతా దృక్పథాన్ని ప్రతిపాదిస్తారు. ప్రకృతి, మనిషి మధ్య సమతుల్య సంబంధం అవసరమని ఈ కావ్యం ప్రబోధిస్తుంది. ప్రకృతిని దోచుకోవడం వల్లే ఇలాంటి విపత్తులు వస్తాయని సూచిస్తూ, కలిసి మెలిసి జీవించడమే మానవ మనుగడకు మార్గమని కవి నొక్కి చెప్తారు.
“సమస్త ప్రాణి కలిసి మెలిసి జీవించడానికి పూచీ పడాల్సింది మనిషే” అనే సందేశం ఈ కావ్య సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తంగా “అనిమేష” కరోనా కాలపు చరిత్రను కవిత్వ రూపంలో నమోదు చేసిన విలువైన కావ్యం. బాధను కళాత్మకంగా వ్యక్తీకరిస్తూనే ఆశను, మనోధైర్యాన్ని అందించడం ఈ కావ్య ప్రత్యేకత. అందువల్ల “అనిమేష” సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించిన కావ్యంగా నిలిచిపోతుంది.
- టి. అంజన్ కుమార్–
