హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏడాదికి 24 ఏకాదశులు వచ్చినా.. ఏ ఏకాదశి ప్రత్యేక ఆ ఏకాదశిదే. ఆషాఢమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏడాది (2026) అలాంటి పవిత్రమైన రోజు ఆగస్టు 9 ఆదివారం వచ్చింది . సహజంగా ఆదివారం జనాలు మాంసం..మద్యం సేవిస్తుంటారు. కాని ఆరోజు అలా చేస్తే పాపాలు వెంటాడుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పూజ చేస్తే పాపాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం ఆషాఢమాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి నాటికి ..చాతుర్మాస కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోఉన్నాడు. ఈ కాలంలో శ్రీ విష్ణుమూర్తిని తులసీ దళాలతో ప్రత్యేక పూజలు చేయడం, వెన్నతో పాటు మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు.
పంచాంగం ప్రకారం, కామికా ఏకాదశి ఈఏడాది ( 2026) ఆగస్టు 8వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:59 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 9న ఉదయం 11:04 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, ఆదివారం రోజున కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
ఆదివారం ( ఆగస్టు9) కామిక ఏకాదశి పూజా విధానం..
- కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి.
- ఉతికిన బట్టలు వేసుకుని, ఇంట్లో పూజా గదిని శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి.
- ఒక ఎర్రని వస్త్రంపై విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
- ఏకాదశినాడు మహా విష్ణువును పూజించాలి.
- ఆ తర్వాత శ్రీహారికి పువ్వులు, పండ్లు, తులసిని సమర్పించాలి.
- పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి.
- స్వామికి పసుపు, చందనం, పసుపు రంగు పువ్వులు సమర్పించాలి.
- పూజలో కచ్చితంగా తులసి దళాలను ఉపయోగించాలి.
- అనంతరం నెయ్యితో దీపారాధన చేసి, కామికా ఏకాదశి వ్రతం కథ, మంత్రాలను చదవాలి.
- చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
- ఈరోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటిరోజు ఉపవాసాన్ని విరమించాలి.
- శ్రీ మహావిష్ణువు చాలీసాను పఠించాలి. భక్తితో స్వామి వారికి హారతి ఇవ్వాలి.
- పెసరపప్పును నానబెట్టి ప్రసాదంగా సమర్పించాలి.
- ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. వారికి దక్షిణ సమర్పించాలి. ఆ తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి
ఆగస్టు 9 కామికా ఏకాదశి రోజు చేయకూడనివి
- ఏకాదశి నాడు బియ్యం, గోధుమలు, బార్లీ, మైదా తదితర ధాన్యపు పదార్థాలు ముట్టుకోకూడదు.
- కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగలు మరియు అన్ని రకాల బీన్స్ నిషిద్ధం
- ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, చేపలు, గుడ్లు , మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి
- ఏకాదశి రోజు పగటి పూట నిద్రపోవడం మంచిది కాదు.
- తలస్నానం చేసేటప్పుడు నూనె రాసుకోవడం, క్షౌరము (కటింగ్), గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదు.
- కోపగించుకోవడం, ఇతరులను దూషించడం, అబద్ధాలు ఆడడం, చెడు ఆలోచనలు చేయకూడదు.
- కామిక ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు.
- స్త్రీలు తల స్నానం చేయకూడదు.
- దేవశయని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
