ఎక్సైరీ డేట్ అయిపోయిన పాలు, కుళ్లిపోయిన మాంసం, బూజు పట్టిన కూరగాయలు.. బెంగళూరులో ఫైవ్ స్టార్ హోటల్స్ బాగోతం

ఎక్సైరీ డేట్ అయిపోయిన పాలు, కుళ్లిపోయిన మాంసం, బూజు పట్టిన కూరగాయలు.. బెంగళూరులో ఫైవ్ స్టార్ హోటల్స్ బాగోతం

బెంగళూరు: ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బెంగళూరులో ఫైవ్ స్టార్ హోటల్స్ బాగోతం బయటపడింది. ఎక్సైరీ డేట్ అయిపోయిన పాలు, కుళ్లిపోయిన మాంసం, బూజు పట్టిన కూరగాయలు.. ఇవీ బెంగళూరులోని తాజ్ యశ్వంత్‌పూర్, షాంగ్రి-లా లాంటి అత్యంత విలాసవంతమైన హోటళ్లు, రిసార్ట్‌లలో కనిపించిన దృశ్యాలు.

బెంగళూరు సిటీలోని విలాసవంతమైన హోటళ్లే టార్గెట్గా కర్ణాటక ఆహార భద్రత విభాగం తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు అర్బన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 26 త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటళ్లను తనిఖీ చేయడానికి, ఆహార భద్రతా అధికారులతో కూడిన 30 బృందాలను సదరు శాఖ నియమించింది. ఈ తనిఖీలు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) పరిధిలోని అన్ని జోన్‌లలో జరిగాయి.

లలిత్ అశోక్ (అనెక్స్ సౌత్)లో 76 కిలోల మాంసం, 200 కిలోల కూరగాయలు, 32 లీటర్ల గడువు ముగిసిన పాలను అధికారులు సీజ్ చేశారు. బెంగళూరులోని షాంగ్రి-లాలో 15 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో అధికారులు 19 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివంత బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో, గడువు ముగిసిన మూడు కిలోల బేకరీ ఉత్పత్తులను ధ్వంసం చేశారు. తాజ్ యశ్వంత్‌పూర్‌లో అధికారులు 72 కిలోల మాంసం, చేపలను స్వాధీనం చేసుకున్నారు.

అతి పెద్ద రికవరీలలో ఒకటి రాడిసన్ బ్లూ (ది అట్రియా)లో జరిగింది, అక్కడ అధికారులు గడువు ముగిసిన 105 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. వీటిలో.. 50 కిలోల చికెన్, 25 కిలోల మాంసం, 23 కిలోల చేపలు, 7 కిలోల కూరగాయలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంత పెద్ద హోటల్ అయినా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.