న్యాయవాదులతో పోలీసుల లొల్లి.. మహిళా లాయర్ తో దురుసు ప్రవర్తన ..అత్తాపూర్ పీఎస్లో ఘటన

న్యాయవాదులతో పోలీసుల లొల్లి.. మహిళా లాయర్ తో దురుసు ప్రవర్తన ..అత్తాపూర్ పీఎస్లో ఘటన

గండిపేట, వెలుగు: అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో మంగళవారం ఇద్దరు న్యాయవాదులతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్​మీడియాలో వైరలయ్యింది. స్టేషన్​బెయిల్​విషయంలో పోలీస్​స్టేషన్​కు వచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన ఓ అడ్వొకేట్​ను చుట్టుముట్టిన పోలీసులు అతడి నుంచి ఫోన్​లాక్కోవడం ఆ వీడియోలో కనిపించింది. దీన్ని వీడియో తీస్తున్న ఓ మహిళ అడ్వకేట్​తోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.  ‘ఇదేం మర్యాద..ఇదేం మర్యాద..బయటకు వెళ్లిపోండి. గెట్​అవుట్’ అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్​లాక్కునే ప్రయత్నం చేశారు. ‘నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా..నా మీదకు ఎందుకు వస్తున్నారు? నేనేం తప్పు చేశాను ..దూరంగా ఉండండి’అని ఆమె మాట్లాడం కనిపించింది. అయితే, ఈ వీడియోలు న్యాయవాదుల వాట్సాప్​గ్రూపులతో పాటు ఇతర గ్రూపుల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. బార్​అసోసియేషన్​పెద్దలను పిలిపించి మాట్లాడారు. న్యాయవాదులతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఏఎస్​ఐతో పాటు కానిస్టేబుల్​తో క్షమాపణలు చెప్పించి కథను సుఖాంతం చేశారు. కాగా, స్టేషన్​బెయిల్​కోసం వచ్చిన న్యాయవాదులు కస్టడీలో ఉన్న నిందితుడికి కొన్ని ప్యాకెట్లు ఇచ్చారని, ఆ విషయంలో తాము అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ జరిగిందని పోలీసులు చెప్తున్నారు.