ముంబై: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయని, నాసిరకం ప్రొటెక్టర్ల అమ్మకాలపై నిషేధం విధించింది. స్క్రీన్ ప్రొటెక్టర్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఈమేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తయారీదారులు, దిగుమతిదారులు ఈ రూల్స్‌కు అనుగుణంగా మారేందుకు ప్రభుత్వం 6 నెలల గడువు ఇచ్చింది. ఇందుకోసం కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఇకపై భారత్‌లో అమ్మే ప్రతి స్క్రీన్ ప్రొటెక్టర్ బీఐఎస్ నిర్దేశించిన ఐఎస్ 19348:2025 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేయాల్సి ఉంటుంది. గ్లాస్ సైజ్, దృఢత్వం ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం పేర్కొంది. డిస్ ప్లే స్పష్టంగా కనిపించేలా ఉండాలని, బ్లూలైట్ ఫిల్టర్ ఉండాల్సిందేనని స్పష్టంచేసింది.
