వందేమాతరం మొత్తం పాడకపోవడం శిక్షార్హమైన నేరం కాదని భావిస్తున్నం: సుప్రీంకోర్టు 

వందేమాతరం మొత్తం పాడకపోవడం శిక్షార్హమైన నేరం కాదని భావిస్తున్నం: సుప్రీంకోర్టు 

జాతీయ గేయంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
ఆరు చరణాలు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం
వ్యతిరేకిస్తూ సుప్రీంలో సంగీత విద్వాంసుడి పిటిషన్ 
చట్టాలు నక్సలైట్ల ఆలోచనల ప్రకారం ఉండవన్న ఏఎస్​జీ
వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
కేంద్ర ప్రభుత్వం స్పందన తెలియజేయాలన్న సుప్రీం కోర్టు

 
న్యూఢిల్లీ: మతపరమైన కారణాలతో వందేమాతరం పాడని పక్షంలో శిక్షార్హమైన నేరం కాదని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగత నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వందేమాతరం పాడకుండా అడ్డుకున్నా, లేదా పాడుతున్న సభలో అంతరాయం కలిగించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేలా జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం–1971కు కేంద్రం సవరణలు చేసిన విషయం తెలిసిందే.

 దీని ప్రకారం గేయంలోని పూర్తి ఆరు చరణాలను తప్పనిసరిగా పాడాలంటూ  కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ గీతం ఏమిటన్నది తేల్చడం తమ పరిధిలోని విషయం కాదని, ధర్మాసనం పేర్కొంది. 

అయితే, మనస్సాక్షి ప్రకారం గేయం పాడేందుకు నిరాకరించిన వారి హక్కును కాపాడిన 1986నాటి బిజో ఇమ్మాన్యుయేల్ తీర్పులోని సూత్రాన్నే తాము అనుసరిస్తామని స్పష్టం చేసింది. రెండు చరణాలా, నాలుగు చరణాలా అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వమే నిర్ణయించాల్సిన అంశమని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కింద హామీ ఇవ్వబడిన హక్కుల ఉల్లంఘన జరిగిందని భావించి అభ్యంతరం చెప్పే వ్యక్తికి శిక్ష వేయరాదని స్పష్టం చేసింది. 

‘జాతీయ గీతం’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదని, ఇది దుర్వినియోగానికి దారితీయవచ్చని పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ మురళీధర్ వాదించారు. దీనిపై స్పందిస్తూ, అమెరికాను సానుకూల లౌకికవాదానికి నమూనాగా చెప్పుకుంటున్నప్పటికీ ఆ దేశ జాతీయ గీతంలో "ఇన్ గాడ్ వి ట్రస్ట్" అనే పదాలు వాడతారని జస్టిస్ బాగ్చీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ‘‘చట్టాలు నక్సలైట్ల ఆలోచనల ప్రకారం ఉండవు’’ అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలపై మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయగా, సొలిసిటర్ జనరల్ నిరాకరించారు. తాను చట్టబద్ధ ప్రక్రియను గౌరవించని వారిని ఉద్దేశించే అలా అన్నానని ఆయన స్పష్టం చేశారు. పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నోటీసు జారీ చేయవద్దని, అది వివాదాన్ని పెద్దది చేస్తుందన్న సొలిసిటర్ జనరల్ చేసిన విజ్ఞప్తికి ధర్మాసనం అంగీకరించింది.  దీనిపై రెండు వారాల్లో  కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని బెంచ్ ఆదేశించింది.