- జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి పాలమూరు-రంగారెడ్డిని ఆగం చేశారు
- పదేండ్లు ఏమీ చేయకుండా.. ఇప్పుడు ధర్నాల పేరిట పొలిటికల్ డ్రామాలని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న నీటి సంక్షోభానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత ఇరిగేషన్ విధానాలే ప్రధాన కారణమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి ప్రాజెక్టులను గాలికొదిలేసిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ధర్నాల పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
మంగళవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమై వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవమేనని.. అయితే గత పాలకుల ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే దక్షిణ తెలంగాణ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు.
కృష్ణా బేసిన్‌లోని ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల్లో 361 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం దాదాపు 120 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయన్నారు. వర్షాలు పడనప్పుడు ఏ ప్రభుత్వమూ నీటిని సృష్టించలేదని.. కానీ ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి నిల్వకు రిజర్వాయర్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
జూరాల నుంచి మార్చి.. ఆగం చేశారు..
పాలమూరు-–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దక్షిణ తెలంగాణకే గొడ్డలిపెట్టుగా మారిందని ఉత్తమ్ ఆరోపించారు. 2013లో జీవో 72 ద్వారా జూరాల నుంచి 70 టీఎంసీల కృష్ణా వరద జలాలను ఎత్తిపోసి దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారని గుర్తు చేశారు.
‘‘జూరాల నుంచి నీటిని ఎత్తిపోయడం సులువు, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ బీఆర్‌ఎస్ సర్కారు ప్రాజెక్టు ఇన్‌టేక్ పాయింట్‌ను శ్రీశైలం బ్యాక్‌వాటర్‌కు మార్చింది. దీంతో లిఫ్ట్ ఎత్తు, రిజర్వాయర్లు, నిర్మాణ వ్యయం, కరెంట్ భారం పెరిగాయి’’ అని పేర్కొన్నారు. ఏడేండ్లలో పాలమూరు-రంగారెడ్డిపై దాదాపు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా సరైన డీపీఆర్ సమర్పించలేదని ఆరోపించారు.
ప్రాజెక్టులను గాలికొదిలారు..
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు, భూసేకరణ పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా బేసిన్‌లో 286.78 టీఎంసీల నీటిని వినియోగించుకున్నామని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగంగా చేస్తున్నామని.. జూన్ 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
