నిమ్స్‌‌‌‌‌‌‌‌లో అవినీతి అనకొండ.. డాక్టర్ లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ ఆస్తుల చిట్టా ఇదీ..

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో అవినీతి అనకొండ.. డాక్టర్ లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ ఆస్తుల చిట్టా ఇదీ..

ఇల్లు, నిమ్స్​లోని చాంబర్ ​సహా 
ఏడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
6.13 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు, మార్కెట్‌‌‌‌‌‌‌‌ వ్యాల్యూ 70 కోట్ల పైనే
అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఏసీబీ అధికారులు, చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలింపు

 
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామ్స్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్‌‌‌‌‌‌‌‌) హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ అడిషనల్ మెడికల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్ డాక్టర్​ లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ ఏసీబీ వలకుచిక్కారు. గతంలో అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా, ప్రస్తుతం మెడికల్ అడిషనల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌లో ఆయన నివాసం ఉంటున్న ఫ్లాట్‌‌‌‌‌‌‌‌తో పాటు నిమ్స్‌‌‌‌‌‌‌‌లోని ఆయన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 

ఈ సోదాల్లో 517 గ్రాముల బంగారు ఆభరణాలు సహా రూ.6.13 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు.డెబిట్‌‌‌‌‌‌‌‌రికవరీ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ వద్ద వివాదంలో ఉన్న రూ.1.3 కోట్లు విలువ చేసే ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడంతో పాటు పలువురికి రూ.1.3 కోట్లు అప్పుగా ఇచ్చినట్టు అధికారులు తేల్చారు. కుటుంబ సభ్యుల పేరిట ఉన్న జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ కార్లు, రాయల్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్, వెస్పా, హోండా యాక్టివా, యమహా బైకులను సీజ్‌‌‌‌‌‌‌‌చేశారు. 

వీటితో పాటు రూ. 5 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌ప్రకారం.. దాదాపు రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. సోదాల అనంతరం లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి.. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

సిబ్బంది నియామకాల నుంచి మెడికల్​ షాపుల​అనుమతుల వరకు అవినీతి..

గతంలో నిమ్స్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ గా ఉన్న సమయంలో సిబ్బంది నియామకాల్లో లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు నిమ్స్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే మెడికల్ షాపులకు అనుమతులు సహా ఇతర వైద్యపరికరాల కొనుగోళ్ల వ్యవహారంలోను భారీగా అవినీతి జరిగినట్టు ఏసీబీకి ఫిర్యాదు అందినట్టు తెలిసింది. 

కాగా, కొత్తగా నిమ్స్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాహుల్ దేవరాజ్‌‌‌‌‌‌‌‌ నియామకం తర్వాత లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ ను అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా బదిలీ చేశారు. మెడికల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్న సమయంలో కూడా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ లావాదేవీల్లో అనుమానిత ట్రాన్సాక్షన్లను గుర్తించారు. వీటి ఆధారంగా పలువురు ఉద్యోగులను విచారించారు. 

కాగా, ఇటీవల ఏసీబీకి అందిన ఫిర్యాదులకు సంబంధించి జరిగిన లావాదేవీలు, చేతులు మారిన లంచం మూలాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు, వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల హెచ్‌‌‌‌‌‌‌‌వోడీల ప్రమేయంపై కూడా ఏసీబీ ఆధారాలు సేకరించినట్టు సమాచారం. 

లక్ష్మీ భాస్కర్ ఆస్తుల చిట్టా ఇదీ..

కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో హైరైజ్‌‌‌‌‌‌‌‌ గేటెడ్ 
కమ్యూనిటీలో రెండు ఫ్లాట్లు
మణికొండ, పేట్‌‌‌‌‌‌‌‌బషీరాబాద్, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో 
ఐదు డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్ ఫ్లాట్లు
యాదాద్రి, నందిగామ, శామీర్‌‌‌‌‌‌‌‌పేట్, విశాఖపట్నం సిటీలో నాలుగు ఓపెన్ ప్లాట్లు
బ్యాంక్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌: రూ. 41లక్షలు
పోస్టాఫీస్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లు: రూ. 12 లక్షలు
ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థలలో పెట్టుబడులు: రూ. 35 లక్షలు 
మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌: రూ. 29.55 లక్షలు