న్యూఢిల్లీ: జల భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, జన భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దేశంలో వాతావరణ మార్పులను తట్టుకునేలా నీటి నిర్వహణ తీరుపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ రాసిన ఓ ప్రత్యేక వ్యాసాన్ని ప్రధాని మోదీ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. జల్ జీవన్ మిషన్, నమామీ గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి దేశంలో చేస్తున్న ప్రయత్నాలపై పాటిల్ చక్కగా వ్యాసం రాశారని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రాలు, వివిధ కమ్యూనిటీలు నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం, భవిష్యత్ తరాలకు సుస్థిర పద్ధతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని అన్నారు. నీటి సంరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యమయ్యే ఒక పెద్ద ఉద్యమంలా (జన్ ఆందోళన్) ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
