స్కిల్ వర్సిటీలో గ్లోబల్ సమిట్‌..‌‌‌ అక్టోబర్‌ 31లోగా అవసరమైన పనులన్నీ పూర్తి చేస్తం: మంత్రి వివేక్

స్కిల్ వర్సిటీలో గ్లోబల్ సమిట్‌..‌‌‌ అక్టోబర్‌ 31లోగా అవసరమైన పనులన్నీ పూర్తి చేస్తం: మంత్రి వివేక్

చకచకా సెమినార్​ హాల్స్, ఇతర మౌలిక వసతులు 
ఈ భవనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అంతా స్కిల్‌ వర్సిటీకే 
ఫిబ్రవరి నాటికి యూనివర్సిటీలో కార్యకలాపాలు
శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి వెల్లడి

 
హైదరాబాద్, వెలుగు‌: తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌ 2026’ను ఫ్యూచర్ సిటీలోని స్కిల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శక్తి, గనుల శాఖ మంత్రి  వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. అవసరమైన మెటీరియల్‌, మ్యాన్‌పవర్‌ నియామకం, పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి.. షెడ్యూల్‌ ఖరారు చేసినట్టు చెప్పారు. 

సమిట్‌ నిర్వహణకు సంబంధించి వర్సిటీలో జరుగుతున్న పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని మౌలిక వసతుల పనులతోపాటు రోడ్లు, డ్రైనేజీలు, తదితర వర్క్స్‌ను అక్టోబర్‌ 31లోగా పూర్తి చేసి సమిట్‌ టీమ్‌కు అప్పగిస్తామని తెలిపారు. 

సమిట్‌ నిర్వహణకు ముందు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బృందానికి అవసరమైన సమయం ఉండేలా పనులను ముందుగానే పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. 6 సెమినార్‌ హాళ్లను సిద్ధం చేస్తున్నామని, వీటితోపాటు 3 పెద్ద హాళ్లు, మరో 10 చిన్న హాళ్లను కూడా సిద్ధం చేస్తున్నామని వివరించారు. సమిట్‌లో నిర్వహించే వివిధ సమావేశాలు, సెమినార్లు, ఇతర కార్యక్రమాలకు తగ్గట్టుగా ఈ హాళ్లను వినియోగించనున్నట్టు తెలిపారు. 

54 ఎకరాల్లో స్కిల్‌ వర్సిటీ..

గ్లోబల్ సమిట్‌ కోసం చేసే ఏర్పాట్లు, నిర్మించే మౌలిక వసతులు అనంతరం కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి చెప్పారు. సమిట్‌ పూర్తయిన అనంతరం ఈ భవనాలు, మౌలిక వసతులను స్కిల్‌ యూనివర్సిటీకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. 54 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్‌ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. 

యూనివర్సిటీ భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా సమిట్‌ కోసం చేపడుతున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నట్టు చెప్పారు.  యూనివర్సిటీలో బాయ్స్‌ హాస్టల్‌, గర్ల్స్‌ హాస్టల్‌, డైనింగ్‌ హాల్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. వీటిని వేగంగా  పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి నాటికి స్కిల్‌ యూనివర్సిటీలో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.