అడవుల్లో ఉద్యాన పంటలు.. మేఘాలయ మోడల్‎పై తెలంగాణ అధ్యయనం 

అడవుల్లో ఉద్యాన పంటలు.. మేఘాలయ మోడల్‎పై తెలంగాణ అధ్యయనం 
  • అటవీ శాఖ, హార్టికల్చర్, ఉపాధి టీమ్స్​ సమన్వయంతో సాగుకు యోచన
  • బాంబూ, పామాయిల్, ఔషధ మొక్కల సాగుతో ఆదివాసీలు, గిరిజనులకు ఉపాధి
  • అమలైతే పోడు సమస్యకు చెక్  పడే అవకాశం ఉందంటున్న ఎక్స్​పర్ట్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీ భూముల​ ఆక్రమణ, పోడు భూమల సమస్యకు చెక్​ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్లాన్​ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా మేఘాలయ మోడల్ పై అధ్యయనం చేయాలని భావిస్తోంది. అక్కడ కమ్యూనిటీ ఆగ్రో ఫారెస్ట్రీ విధానంతో ఫారెస్ట్​ లాండ్స్​ జోలికి ఎవరూ వెళ్లడం లేదు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న అంతర పంటల విధానమే అందుకు కారణమని ఫారెస్ట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. 

అడవి దెబ్బతీయకుండానే.. పెద్ద చెట్ల నీడలో వెదురు, పామాయిల్, మిరియాలు, బ్రూమ్‌‌గ్రాస్, అల్లం, పైనాపిల్, ఔషధ మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఆఫీసర్ల ఆధ్వర్యంలో అటవీ శాఖ​ పర్యవేక్షణ చేస్తుండగా.. సాగు నిర్వహణ బాధ్యతలను స్థానిక స్వయం సహాయక బృందాలు, గ్రామ మండళ్లకు అప్పగించారు. పంట ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకే దక్కుతుండడంతో ఫారెస్ట్​ను తమ సొంత ఆస్తిగా భావించి స్థానికులే రక్షించుకుంటుకున్నారు. 

ఇప్పుడు ఇదే మోడల్‌‌ను మన రాష్ట్రంలో అవలంబించాలని పర్యావరణవేత్తల నుంచి డిమాండ్​ వస్తోంది. నేల స్వభావానికి అనుగుణంగా అంతర్​ పంటలు సాగు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని సూచనలు వస్తుండడంతో ఆ దిశగా ముందుకెళ్లేందుకు కసరత్తు 
చేస్తున్నారు.

7.65 లక్షల ఎకరాల అటవీ భూముల ఆక్రమణ

తెలంగాణ అటవీశాఖ, ఇండియా స్టేట్  ఆఫ్  ఫారెస్ట్  రిపోర్ట్(ఐఎస్ఎఫ్ఆర్​) నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో 66.54 లక్షల ఎకరాల(సుమారు 26.96 లక్షల హెక్టార్లు) అటవీ భూమి ఉంది. రాష్ట్రంలో 5.3 లక్షల ఎకరాల నుంచి 7.65 లక్షల ఎకరాల ఫారెస్ట్​ లాండ్స్​ ఆక్రమణకు గురైనట్లు అటవీశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

 రాష్ట్రంలో ఉన్న మొత్తం అటవీ విస్తీర్ణంలో దాదాపు 8 శాతం నుంచి 11.48 శాతం భూమి ఆక్రమణలు లేదా ఇతరుల ఆధీనంలోనే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్  జిల్లాల్లో అత్యధికంగా అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు సర్కార్​ చర్యలు చేపడుతోంది. 

ఇందులోభాగంగా అటవీ భూముల సరిహద్దుల వివాదాలను పరిష్కరించడానికి అక్రమ రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అడవుల చుట్టూ రక్షణ కందకాలు తవ్వడం, సరిహద్దులను గుర్తించడం, పోలీస్, రెవెన్యూ అధికారుల సహాయంతో ఆక్రమణలను తొలగించేలా స్పెషల్​ డ్రైవ్‌‌లను నిర్వహిస్తోంది. అయితే, ఆక్రమణలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

మూడు శాఖల సమన్వయం మస్ట్..

అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండాలంటే స్థానిక ప్రజలకు అటవీ రక్షణలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఫారెస్ట్, హార్టికల్చర్, ఉపాధి హామీ(వీబీ జీ రామ్​ జీ)శాఖల సమన్వయంతో అటవీ ప్రాంతాల్లో వాణిజ్య, ఉద్యాన పంటల సాగుకు ప్రణాళికలు చేస్తోంది. దీనిని సక్సెస్​ చేసేందుకు ప్రభుత్వం  మూడు శాఖలను  సమన్వయం చేయాలని యోచిస్తోంది. అయితే, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ కబ్జాలకు గురయ్యే అవకాశం ఉన్న సరిహద్దు అటవీ భూములను, క్షీణించిన అటవీ ప్రాంతాలను గుర్తించడంతో పాటు సాంకేతిక సహాయం, నిరంతర పర్యవేక్షణ చేసేలా కసరత్తు చేస్తోంది. 

ఇక హార్టికల్చర్ శాఖ అటవీ నేలలకు సరిపడే నాణ్యమైన బాంబూ(వెదురు), ఆయిల్ పామ్, పైనాపిల్, అల్లం, మిరియాలు, పసుపు, తులసి తదితర ఔషధ మొక్కల నారును అందించడంతో పాటు సబ్సిడీలు అందిస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. ఉపాధి స్కీమ్​లో మొక్కలు నాటడం, గుంతలు తీయడం, కలుపుతీత, డ్రిప్ లైన్లు వేయడం వంటి పనులను చేపట్టాలని, దీనివల్ల స్థానికులకు పనులతోపాటు ఆర్థిక భరోసా కలుగుతుందని భావిస్తోంది. 

సర్కార్​ ఫోకస్​ చేస్తేనే సత్ఫలితాలు.. ​

మేఘాలయ తరహాలో అటవీ రక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేసి, ఆర్థిక ప్రయోజనం చేకూర్చితే అటవీ వివాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. అక్కడి విధానంపై సర్కార్​ ఫోకస్​ పెట్టి అడవుల రక్షణకు చర్యలు చేపడితే సత్ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నారు. ఫారెస్ట్  పరిసర గ్రామాల్లో వన సంరక్షణ సమితులను(వీఎస్ఎస్) పునరుద్ధరించి, వారికి ఈ బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. 

ఫారెస్ట్  భూమిని కాపాడితేనే తమకు పంట చేతికి వస్తుందనే ఆర్థిక భరోసా స్థానికుల్లో ఏర్పడుతుందని అంటున్నారు. దీనిద్వారా బయటి వ్యక్తులు, ఆక్రమణదారులు ఫారెస్ట్​లోకి వస్తే స్థానికులే అడ్డుకునే చాన్స్​ ఉంటుందని చెబుతున్నారు. స్థానిక ప్రజలకు జీవనోపాధి కల్పించనంత కాలం పోడు, ఆక్రమణల సమస్య ఉంటుందని పేర్కొంటున్నారు.