మీకు తెలుసా ? పార్లమెంట్ క్యాంటీన్లో 2003 నుంచే కూల్ డ్రింక్స్ బ్యాన్ !  

మీకు తెలుసా ? పార్లమెంట్ క్యాంటీన్లో 2003 నుంచే కూల్ డ్రింక్స్ బ్యాన్ !  

ఢిల్లీ: భారత పార్లమెంట్ క్యాంటీన్లలో కూల్ డ్రింక్స్ను నిషేధించిన విషయం ఎంత మందికి గుర్తుంది..? 2003 నుంచే పెప్సీ, కోకా కోలాతో పాటు ఇతర కూల్ డ్రింక్స్పై పార్లమెంట్ నిషేధం విధించింది. కూల్ డ్రింక్స్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని CSE రిపోర్ట్ తేల్చింది.

దీంతో.. ఈ ఉదంతంపై పార్లమెంట్ చర్చించింది. ప్రభుత్వ దర్యాప్తునకు కూడా ఈ పరిణామం దారితీసింది. దీంతో.. 2003 నుంచే పార్లమెంట్ క్యాంటీన్‌లో జనాదరణ పొందిన శీతల పానీయాలను అధికారికంగా నిషేధించారు.

అసలేం జరిగిందంటే..
ఢిల్లీకి చెందిన పరిశోధన సంస్థ అయిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) ప్రయోగశాలలో కూల్ డ్రింక్స్పై నిర్వహించిన పరీక్షల ఫలితాలను 2003 ఆగస్టులో విడుదల చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి కూల్ డ్రింక్స్ నమూనాలను తీసుకెళ్లి పరీక్షించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఫలితాలు భయపెట్టాయి.

కోకా-కోలా, పెప్సీతో సహా.. పన్నెండు బ్రాండ్‌ల కూల్ డ్రింక్స్లో పురుగుమందుల అవశేషాల ఆనవాళ్లు కనిపించాయి. గుర్తించిన రసాయనాలలో లిండేన్, DDT, మలాథియాన్, క్లోర్‌పైరిఫాస్ ఉన్నాయి. ఈ కెమిక్స్ అన్నీ అప్పటికప్పుడు అనారోగ్యానికి గురిచేయకపోయినప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

ఈ రిపోర్ట్ అప్పట్లో లోక్‌సభ ముందుకు వచ్చింది. అప్పటి ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్.. జీరో అవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కూల్ డ్రింక్స్ కంపెనీలు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. చర్చ అనంతరం.. అప్పటి సభా ఆహార కమిటీ ఛైర్మన్ ఇ. అహ్మద్.. కోకా-కోలా, పెప్సీ, ఇతర శీతల పానీయాలపై నిషేధాన్ని అమలు చేయాలని పార్లమెంట్ క్యాంటీన్‌ను ఆదేశించినట్లు సభ్యులకు తెలియజేశారు. సభలో ఉన్న ఎంపీలు ఈ ప్రకటనను స్వాగతించారు.