పాట్నా: బిహార్‌లోని జముయి జిల్లాలో ఓ బాలుడు, బాలికను కొంతమంది ఆకతాయిలు వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. స్నేహితులైన ఒక బాలుడు, బాలిక ఒకే కోచింగ్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్తున్నారు.
సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం జముయి ప్రాంతంలో వారిద్దరూ రోడ్డుపై వెళ్తుండగా కొంతమంది ఆకతాయిలు వేధించి, దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఆదివారం వరకు బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, సోమవారం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్న ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో పోలీసులు బాధితులు, నిందితులను ట్రేస్ చేశారు. మహిళా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ( ఎస్‌డీపీఓ) దీప్తి మోనాలి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.
జముయి పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీడియో క్లిప్ ఆధారంగా సుమారు ఏడుగురు నిందితులను గుర్తించారు. సోమవారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ వీడియోను తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ దారుణంపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతుంటాయని తేలిగ్గా తీసిపారేశారు.
అంధభక్తులే వీటికి కారణం: రాహుల్ గాంధీ
ఈ ఘటన తీవ్ర ఆందోళనకరమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ఇది కల్చర్ కాదు, పితృస్వామ్య వ్యవస్థ అని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు సాధారణం కావడానికి అంధభక్తులే కారణమని ఆరోపించారు.
వీడియోలో గుర్తించిన వ్యక్తులపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ రోడ్డుపై ఒక అమ్మాయికి ఎందుకు భద్రత లేదు? అని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆప్, టీఎంసీ పార్టీలతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
