తిరువనంతపురం: కేరళ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి, వరదల ధాటికి ఇప్పటిదాకా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిసూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో 115.6 మి.మీ నుంచి 204.4 మి.మీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొల్లం, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లోని కొన్ని ఏరియాల్లో తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం సాయంత్రం ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితిని సీఎం వీడీ సతీశన్ నిరంతరం సమీక్షిస్తున్నారు.
నీలంబూర్‌లో వరదలు.. ఐదుగురు మృతి
భారీ వర్షాలకు మలప్పురం జిల్లాలోని నీలంబూర్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కొట్టాపుజ నది నీటి ప్రవాహానికి ఆదివారం సాయంత్రం నీలంబూర్‌లోని టీకే కాలనీ ఎకో-టూరిజం సెంటర్ వద్ద ఆరుగురు కొట్టుకుపోగా.. సోమవారం ఉదయం నాటికి అధికారులు 5 డెడ్ బాడీలను గుర్తించారు. మరొకరి ఆచూకి కోసం రెస్క్యూ కొనసాగుతున్నది.
