యాదగిరిగుట్ట, వెలుగు: ఎన్నికలు, రాజకీయాలే కాకుండా సేవలోనూ ముందుండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప అభియాన్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ బర్త్డే వేడుకల్లో భాగంగా సోమవారం యాదగిరిగుట్టలో యువమోర్చా, బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.
బర్త్డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో 25 వేల మందితో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మోదీ జన్ ధన్ యోజన, గరీబ్ కల్యాణ్ అన్న యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా దేశ ప్రజలను ఆర్థికంగా ముందంజలో నిలిపారని, వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. బీజేపీ, బీజేవైఎం నేతలు ఉట్కూరి అశోక్ గౌడ్, కాదూరి అచ్చయ్య, పాశం భాస్కర్, కర్రె ప్రవీణ్, రచ్చ శ్రీనివాస్, బెలిదే అశోక్, మాధురి, గుంటుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
