టెల్ అవీవ్: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇజ్రాయెల్ మీడియా సంస్థ జెరూసలేం పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. మోజ్తాబా ఖమేనీ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారని పేర్కొంది. త్వరలోనే అతడి మరణ వార్త విన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పరిపాలనకు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ జెరూసలేం పోస్ట్ ప్రచురించిన ఈ కథనంతో మోజ్తాబా ఖమేనీ హెల్త్ కండిషన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. మోజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇరాన్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా.. ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ తన తండ్రి స్థానంలో ఇరాన్ సర్వోన్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు మోజ్తాబా ఖమేనీ. కానీ అప్పటి నుంచి ఆయన ఒక్కసారిగా కూడా బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు.
చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. అమెరికా దాడుల్లో రెండు కాళ్లకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతోనే మోజ్తాబా ఖమేనీ ప్రజల ముందుకు రావడం లేదని సమాచారం. అయితే భద్రతా కారణాల వల్లే మొజ్తాబా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఆయనపై మరో దాడి జరిగే అవకాశం ఉందనే హెచ్చరికల క్రమంలో ప్రజల్లో కనిపించవద్దని భద్రతా సిబ్బంది సూచించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
