వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టు జడ్జిల తీర్పుల కారణంగా దేశానికి లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గరమయ్యారు. టారిఫ్‌లు, బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అంశాలపై జడ్జిలు ఇటీవల తీసుకున్న నిర్ణయాల వల్ల దేశం భారీగా నష్టపోయిందని, పౌరసత్వ ప్రక్రియ కూడా దెబ్బతిన్నదని ఆరోపించారు.
శనివారం తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈమేరకు జడ్జిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లోపభూయిష్టమైన, రాజకీయపరమైన, హాస్యాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాను మళ్లీ గొప్ప స్థానంలోకి తీసుకెళ్లేందుకు (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) సుప్రీంకోర్టుకు ధైర్యం సరిపోలేదు” అని ఆయన పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు తీవ్రమైన ఆర్థిక, రాజ్యాంగపరమైన పరిణామాలకు దారితీశాయన్నారు.
‘‘అంతేకాకుండా మన గొప్ప దేశంలో ప్రజలు పౌరులుగా మారే విధానం శాశ్వతంగా దెబ్బతిన్నది. ఇది అమెరికా చరిత్రలో ఒక విషాదకరమైన అధ్యాయం. అయినప్పటికీ మనం విజయం సాధిస్తాం!’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. కాగా, అమెరికాలో జన్మించే పిల్లలకు ఆటోమేటిక్‌గా లభించే పౌరసత్వాన్ని పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ విధానాన్ని ప్రతిపక్షాలు ఫెడరల్ కోర్టులో సవాలు చేశాయి.
దీంతో దిగువ కోర్టులు జారీచేసిన దేశవ్యాప్త ఇంజెక్షన్ ఆర్డర్‌ల పరిధికి సంబంధించిన తీర్పుతో సహా, విస్తృతమైన బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అలాగే, విస్తృతమైన టారిఫ్‌లను విధించే అధికారాన్ని అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టం (ఐఈఈపీఏ) అధ్యక్షుడికి ఇవ్వదని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయం వల్ల సుంకాలు చెల్లించిన దిగుమతిదారులకు జులై 31 నాటికే 100 బిలియన్ డాలర్లను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి వచ్చింది.
