హైదరాబాద్: తోటి ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కస్టడీ వ్యవహారంలో అత్తాపూర్ ఇన్స్పెక్టర్కి మేజిస్ట్రేట్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాగా, ఈ కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు నిందితుడి ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో అత్తాపూర్ పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు. అయితే, కస్టడీలో పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు న్యాయమూర్తి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సీసీ కెమెరాలు లేని చోట ఎలా విచారణ చేశారని పోలీసులను ప్రశ్నించారు. దీనిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ను మేజిస్ట్రేట్ ఆదేశించారు.
మరోసారి కస్టడీ పిటిషన్:
తోటి ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి కోరారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు శుక్రవారం (ఆగస్ట్ 7) కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శనివారం (ఆగస్ట్ 8) కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అసలు కేసు ఏంటంటే..?
రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో తోటీ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై ఉదయ్ కృష్ణారెడ్డిని లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బాధిత ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు జూలై 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జులై 28న మిర్యాలగూడలో నిందితుడు పోలీసులకు చిక్కాడు.
ఈ క్రమంలో పూర్తి విచారణ జరిపేందుకు పోలీసులకు అవకాశం లభించలేదు. దీంతో కేసుకు సంబంధించి మరిన్నీ వివరాలు రాబట్టేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు రెండు రోజులు మాత్రమే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. శుక్రవారం (ఆగస్ట్ 7) సాయంత్రం 5 గంటలతో పోలీసులకు కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది.
అయితే, రెండు రోజుల కస్టడీలో ఉదయకృష్ణ రెడ్డి నోరు మెదపలేదని.. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు నిరాకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో ఉదయకృష్ణ రెడ్డిని మరోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఉప్పరపల్లి కోర్టులో శనివారం (ఆగస్ట్ 8) ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
