ఏపీ నీటి తరలింపు షురూ..శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తన్నుకుపోతున్న పొరుగు రాష్ట్రం

ఏపీ నీటి తరలింపు షురూ..శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తన్నుకుపోతున్న పొరుగు రాష్ట్రం
  •     రెండు గేట్ల ద్వారా ఎస్​ఆర్​బీసీ, తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీరు
  •     తాగునీటి అవసరాలే తీర్చాలంటూ కృష్ణాబోర్డుకు లేఖ

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఇలా వస్తున్నదో లేదో.. ఏపీ అప్పుడే నీటి తరలింపు మొదలుపెట్టింది. గురువారం ఉదయం పోతిరెడ్డిపాడుకు చెందిన 5, 6వ నంబర్​గేట్లను ఎత్తి ఎస్​ఆర్​బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టుల ఆయకట్టుకు 4 వేల క్యూసెక్కులను తీసుకెళ్తోంది. ఓవైపు ఎల్​నినో ముప్పు ఉందని, ఆగస్టు రెండో వారం తర్వాత వరదలకు అవకాశమే లేదని, ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వాడుకోవాలని  చెప్తూనే.. మరోవైపు సాగునీటి అవసరాలకు తోడేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రీశైలం నుంచే కాదు, డెడ్​స్టోరేజ్​కు దగ్గరగా ఉన్న సాగర్​ నుంచీ నీటిని తన్నుకుపోయే వ్యూహాలు పన్నుతోంది.

ఇందుకోసం తక్షణమే కృష్ణా బోర్డు మీటింగ్​ నిర్వహించాలంటూ మూడు రోజుల క్రితం బోర్డు చైర్మన్​కు ఏపీ జలవనరుల శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ లేఖ రాశారు. కృష్ణా బేసిన్​లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని చెప్తూనే.. ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలో ఆయన కోరడం గమనార్హం. ‘‘ఈ సీజన్​లో మిగిలిన సగభాగం కూడా సాధారణం కన్నా తక్కువే వర్షాలుంటాయనే అంచనాలున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో జులై 31 నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదలొస్తున్నాయి. కానీ, సాగర్​లో నీళ్లు లేవు కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. రాయలసీమ, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తాగునీటి అవసరాలను తీర్చాలి. కాబట్టి, వెంటనే కృష్ణా బోర్డు మీటింగ్ నిర్వహించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. 

సాగునీటికి విడుదల..

ఓవైపు తాగునీటి అవసరాలకే కృష్ణా నీటిని వాడుకోవాలని సుద్దులు చెప్తున్న ఏపీ..  మరోవైపు పోతిరెడ్డిపాడు గేట్లు తెరిచి  ఎస్​ఆర్​బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాల కోసం వదులుతోంది.  గురువారం ఉదయం పోతిరెడ్డిపాడుకు చెందిన 5, 6వ నంబర్​ గేట్లను ఎత్తిన ఏపీ ఇరిగేషన్​ అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 4 వేల క్యూసెక్కులు తీసుకుపోతున్నా.. వరద ప్రవాహాన్ని బట్టి నీటి తరలింపు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండకముందే నీటిని తీసుకెళ్తూ.. మరోవైపు మీటింగ్​అంటూ కృష్ణా బోర్డుకు లేఖలు రాయడంపై తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీలకుగాను 147 టీఎంసీల నీళ్లున్నాయి. మరో 70 టీఎంసీల వరకు ఖాళీ ఉంది. ఇలాంటి టైంలో బోర్డు మీటింగ్​ పెట్టకుండా, తెలంగాణ అనుమతి తీసుకోకుండానే.. ఏపీ నీటిని తరలిస్తుండడం వివాదాస్పదమవుతోంది.