- దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే ఆర్థిక లావాదేవీలు
- బీసీ సఖీ ద్వారా స్వయం ఉపాధి పొందనున్న మహిళలు
- ట్రైనింగ్పూర్తి, బయోమెట్రిక్ యంత్రాల పంపిణీ
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం లేకుండా ప్రజలకు సేవలు అందించేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. బ్యాంకులు అందుబాటులో లేని ఏరియాల్లో ప్రజలు పనులు వదులుకుని దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాంకులు ఉన్న మండల, పట్టణ కేంద్రాల పరిధిలోని 5 కిలోమీటర్ల మేర గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు బీసీ సఖీ (బ్యాంకింగ్ కరస్పాండెంట్ సఖీ) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లో అక్షరాస్యులైన సభ్యులను బిజినెస్ కరస్పాండెంట్లుగా గుర్తించి, బ్యాంకింగ్ కార్యకలాపాలపై ట్రైనింగ్ పూర్తి చేసి బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. దీంతో గ్రామీణ ప్రజలు ఇకపై బ్యాంకింగ్ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ గ్రామాల్లోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కలగనుంది.
బ్యాంకు సేవలు లేని గ్రామాల్లో..
బ్యాంకు సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో బీసీ సఖీల ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించేందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో బిజినెస్ కరస్పాండెంట్ల ఎంపిక చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో 24 మంది మహిళలను ఎంపిక చేసి, వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి, బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్, మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాల్లో పోస్టల్ సేవలు ఇప్పటికే బీసీ సఖీల ద్వారా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
బ్యాంకింగ్ కార్యకలాపాలను కూడా ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు జిల్లాలో 16 మంది, వరంగల్‌లో 18 మంది, జనగామలో 27 మంది, హనుమకొండలో 22 మంది, మహబూబాబాద్‌లో 31 మంది బిజినెస్ కరస్పాండెంట్లను గుర్తించి వారికి బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి లభించడంతో పాటు గ్రామీణ ప్రజలకు క్షేత్రస్థాయిలో బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందించనున్నారు.
అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు..
బీసీ సఖీ ద్వారా గ్రామీణ ప్రజలు బ్యాంకులకు వెళ్లకుండానే తమ నివాస ప్రాంతాల్లోనే పలు బ్యాంకింగ్ సేవలను పొందనున్నారు. వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ, నగదు ఉపసంహరణ, బీమా ప్రీమియం చెల్లింపులు, పింఛన్లు, ఉపాధి హామీ పథకం డబ్బుల చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక లావాదేవీలను కూడా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
బీసీ సఖీలు రోజువారీగా నిర్వహించే ఆర్థిక లావాదేవీల ఆధారంగా వారికి కమీషన్ చెల్లించనున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు గ్రామీణ ప్రజలకు స్థానికంగానే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అదనపు ఆదాయం పొందే అవకాశం..
బీసీ సఖీ ద్వారా మహిళా సంఘాల సభ్యులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 24 మందిని గుర్తించి బ్యాంకింగ్ సేవలపై శిక్షణ ఇవ్వడంతో పాటు బయోమెట్రిక్ యంత్రాలు పంపిణి చేశాం. బీసీ సఖీల ద్వారా చేపట్టే సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
బాలకృష్ణ, డీర్డీఏ పీడీ, భూపాలపల్లి
