అక్షర సూర్యోదయం.. పిల్లలు బళ్లకు బాట పట్టారు

అక్షర సూర్యోదయం.. పిల్లలు బళ్లకు బాట పట్టారు

​తొలకరి తొలి చినుకు తాకిడికి నేల పులకించినట్టు 
బడి గడపలు మళ్లీ నిలువెల్లా శ్వాసించాయి.
నిశ్శబ్దపు పొరలు కప్పుకున్న క్లాస్‌రూములు,
పిల్లల నవ్వుల స్పర్శతో ప్రాణం పోసుకున్నాయి.
​నల్లబల్లపై కదులుతున్న సుద్దముక్క,
భవిష్యత్తు ఆకాశానికి నక్షత్రాల రహదారిని గీస్తోంది.
పుస్తకం... అక్షరాల కూర్పు మాత్రమే కాదు,
కాలపు చేతుల్లో దాగున్న రేపటి సృష్టి!
​బడి ముంగిట పడే ప్రతి చిరు అడుగు,
గమ్యం వైపు పడుతున్న గెలుపు ముద్ర.
వీపుపై మోస్తున్న బ్యాగులు పుస్తకాల బరువు కాదు,
తరాల ఆశల మోపు... తల్లిదండ్రుల కలల పంట!
​బోధించేవాడు ఉపాధ్యాయుడు మాత్రమే కాదు,
చీకటి నరాల్లోకి అక్షరాల వెలుగును ప్రసరింపజేసే సూర్యుడు!
తరగతి గది నాలుగు గోడల నిర్బంధం కాదు,
మేధస్సుకు రెక్కలు తొడిగే విశాల విశ్వం!
​అక్షరం నేర్చుకున్న చిన్నారి కళ్లలో,
అంధకారాన్ని ఓడించే ప్రాతఃకాల కాంతి మెరుస్తుంది.
పెన్సిల్ మొన నుంచి ఉదయిస్తున్న ప్రతి అక్షరం,
కాలం గుండెలపై లిఖిస్తున్న నవ శకం!
​అవును, బడి గంట మోగడమంటే...
కేవలం ప్రార్థనా సమయం ఆరంభించినట్టు కాదు -
పొలంలో రైతు నమ్మకం మళ్లీ ప్రాణం పోసుకున్నట్టు,
అమ్మ కళ్లల్లో ఆశల దీపం మళ్లీ వెలిగినట్టు,
ఈ దేశం... తన రేపటిని
ప్రేమతో మళ్లీ గుండెలకు హత్తుకున్నట్టు!

- యం.డి. ఉస్మాన్ ఖాన్–