- ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకునే ఈ ఇద్దరు నేతలు తమ, తమ పరిధుల్లో వినాశనానికి కారణమవుతున్నారని.. ఒకరు దేశాన్ని నాశనం చేస్తే, మరొకరు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం కర్నాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బి.కె. హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన మెగా కన్వెన్షన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మతం పేరుతో దోపిడీ
భారత్‌లో మతం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఖర్గే మండిపడ్డారు. ఎల్.కె. అద్వానీ రథయాత్ర చేసినప్పుడు రామమందిర నిర్మాణం కోసం సేకరించిన విరాళాలు, సామగ్రికి సంబంధించిన సరైన లెక్కలు ఇప్పటివరకు చూపలేదని, ఇప్పుడు ఏకంగా రూ.5,000 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు రిపోర్టులు వెలువడుతున్నాయని ఆరోపించారు. ‘‘రాముడి పేరును జపిస్తూ పరాయి సొమ్మును కాజేస్తున్నారు. దోపిడీ కోసమే ఈ ఆలయాన్ని నిర్మించారు. హుండీ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? దీని వెనుక ప్రధానికి సంబంధించిన వారు ఉన్నారా లేదా ఇతరులు ఉన్నారా అనే దానిపై సమగ్ర విచారణ జరపాలి’’ అని డిమాండ్ చేశారు. ఆలయాలను స్వామీజీలు, పీఠాధిపతులు ప్రారంభిస్తారని, కానీ ఇక్కడ ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారని ఎద్దేవా చేశారు.
