భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి పరీక్షలు విజయవంతమైతే, వచ్చే ఆర్థిక ఏడాది మొదట్లో వీటిని చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లను మాత్రమే ఈ పాలిమర్ మెటీరియల్‌తో ముద్రించి పరీక్షించనున్నారు.
ప్లాస్టిక్ నోట్లు ఎందుకు తెస్తున్నారంటే
సాధారణ కాటన్ పేపర్ నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు చాలా బలంగా ఉంటాయి చినిగిపోవు. ఇవి నీటి తేమ, మురికి, త్వరగా నలిగిపోకుండా.. చిరిగిపోకుండా ఉంటాయి. రూ.10, రూ.20 నోట్లు ప్రతిరోజు నిత్యవసర లావాదేవీల్లో ఎక్కువగా చేతులు మారుతుంటాయి కాబట్టి త్వరగా పాడైపోతుంటాయి. పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం వస్తాయి కాబట్టి, వాటిని మళ్లీ మళ్లీ ముద్రించే ఖర్చు ప్రభుత్వానికి తగ్గుతుంది.
ప్రయోగాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయి?
తొలి దశలో భాగంగా ఒక బిలియన్ అంటే వంద కోట్లు రూ.10 నోట్లు, మరో బిలియన్ రూ.20 పాలిమర్ నోట్లను ముద్రించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన దేశ వాతావరణ పరిస్థితుల్లో ఈ నోట్లు ఏ విధంగా పనిచేస్తాయో ఈ ట్రయల్ ద్వారా పరిశీలిస్తారు. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితేనే పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నోట్లు ప్రజల వాడుకలోకి వస్తాయి.
ఇతర దేశాల్లో ముందే
ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్ వంటి 60కి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ పాలిమర్ కరెన్సీ విజయవంతంగా చలామణిలో ఉంది. 1988లోనే ఆస్ట్రేలియా ప్రపంచంలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికైతే ఇవి ట్రయల్ దశలో మాత్రమే ఉంటాయని, ప్రస్తుతం నడుస్తున్న కాగితపు నోట్లతోపాటే ఇవి కూడా చెలామణిలో ఉంటాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.
