ఆసియా గేమ్స్లో తొలి రోజే మనోళ్ల హవా.. షూటింగ్‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌కు రెండు రజతాలు..

ఆసియా గేమ్స్లో తొలి రోజే మనోళ్ల హవా.. షూటింగ్‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌కు రెండు రజతాలు..
  • ఆసియా గేమ్స్లో తొలి రోజే మనోళ్ల హవా.. షూటింగ్‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌కు రెండు రజతాలు..
  • మార్షల్​ ఆర్ట్స్లో  సుచికాకు పతకం ఖాయం
  • హాకీలో 19–0తో గోల్స్​ వర్షం .. టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌లో మహిళల జట్టు సంచలన విజయం
  • టీ20ల్లో మంధాన రికార్డు.. టెక్‌‌‌‌బాల్‌‌‌‌లో చేజారిన పతకం

నాగోయా: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తొలిరోజే సత్తా చాటారు. షూటింగ్‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌ వలరివన్‌‌‌‌ రెండు రజత పతకాలు సాధించగా.. మహిళల ట్రెడిషనల్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ (ఎంఎంఏ) 60 కేజీల విభాగంలో సుచికా తారియల్‌‌‌‌ సెమీఫైనల్‌‌‌‌కు చేరి భారత్‌‌‌‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది.

హాకీలో ఉజ్బెకిస్థాన్‌‌‌‌ను 19–0తో చిత్తు చేసిన భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌లో సింగపూర్‌‌‌‌పై 3–2తో విజయం సాధించిన మహిళల జట్టు ఆకట్టుకోగా.. క్రికెట్‌‌‌‌లో స్మృతి మంధాన మహిళల టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకుంది.

19 గోల్స్‌‌‌‌.. భారత్‌‌‌‌ జోరు
మహిళల హాకీలో భారత్‌‌‌‌ గోల్స్‌‌‌‌ వర్షం కురిపించింది. పూల్‌‌‌‌–బి తొలి మ్యాచ్‌‌‌‌లో ఉజ్బెకిస్థాన్‌‌‌‌పై 19–0తో ఘన విజయం సాధించింది. దీపిక ఏకంగా ఎనిమిది గోల్స్‌‌‌‌ చేసి అదరగొట్టింది.  ఫస్ట్​ ఆఫ్​లోనే  8–0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌‌‌‌.. చివరి రెండు క్వార్టర్లలో మరో 11 గోల్స్‌‌‌‌ చేసింది. సవితా పునియా ఈ మ్యాచ్‌‌‌‌తో 320వ అంతర్జాతీయ మ్యాచ్‌‌‌‌ పూర్తి చేసుకుంది.

సింగపూర్‌‌‌‌పై సూపర్‌‌‌‌ విక్టరీ
టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌లో భారత మహిళల జట్టు సింగపూర్‌‌‌‌పై 3–2తో విజయం సాధించింది. ఒక దశలో 1–2తో వెనుకబడిన భారత్‌‌‌‌ను స్రీజా ఆకుల, యశస్విని ఘోర్పడే కీలక విజయాలతో గెలుపు బాట పట్టించారు. నిర్ణయాత్మక మ్యాచ్‌‌‌‌లో యశస్విని విజయం సాధించి భారత్‌‌‌‌కు గెలుపు అందించింది. పురుషుల జట్టు మాత్రం ఇరాన్‌‌‌‌ చేతిలో 0–3తో ఓడింది.

సుచికకు పతకం ఖాయం
ఎంఎంఏ 60 కేజీల విభాగంలో సుచికా తారియల్‌‌‌‌ మంగోలియాకు చెందిన అల్టాన్‌‌‌‌చిమెగ్‌‌‌‌ బైగాల్మాను 2–0తో ఓడించి సెమీఫైనల్‌‌‌‌కు చేరింది. దీంతో భారత్‌‌‌‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. సోమవారం ఆమె సెమీఫైనల్‌‌‌‌లో పోటీపడనుంది. 36 ఏళ్ల సుచికా జూడో, కురాష్‌‌‌‌, జియు–జిట్సు, ఎంఎంఏలో రాణించింది. 

క్విమ్సీకి త్రుటిలో..
టెక్‌‌‌‌బాల్‌‌‌‌ మహిళల సింగిల్స్‌‌‌‌ కాంస్య పతక పోరులో క్విమ్సీ డిసౌజా జపాన్‌‌‌‌ క్రీడాకారిణి యుయినా సకమోటో చేతిలో 11–12, 11–12తో ఓడింది. రెండో సెట్‌‌‌‌లో 10–8 ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివర్లో ఫౌల్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ను చేజార్చుకుంది. కొద్ది నిమిషాలకే మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ కాంస్య పోరులోనూ బరిలోకి దిగిన క్విమ్సీ.. అలసట, వెన్నునొప్పితో ఇబ్బంది పడి ఓటమి చవిచూసింది.

క్వార్టర్స్‌‌‌‌కు.. భారత షట్లర్లు
ఆసియా క్రీడలు–2026లో భారత మహిళల బ్యాడ్మింటన్‌‌‌‌ జట్టు శుభారంభం చేసింది. రౌండ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ 16లో కజకిస్థాన్‌‌‌‌ను 3–0తో చిత్తు చేసి క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. తొలి సింగిల్స్‌‌‌‌లో పి.వి. సింధు 21–7, 21–9తో కామిలా స్మాగులోవాపై విజయం సాధించింది. రెండో సింగిల్స్‌‌‌‌లో ఉన్నతి హుడా 21–7, 21–10తో అలెస్సా కులేషోవాను ఓడించింది.

మూడో సింగిల్స్‌‌‌‌లో తన్వి శర్మ 21–5, 21–10తో డయానా నమేనోవాపై గెలిచి భారత్‌‌‌‌కు క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ అందించింది. ఈ మూడు మ్యాచ్‌‌‌‌లను భారత షట్లర్లు కేవలం 65 నిమిషాల్లోనే ముగించడం విశేషం. మంగళవారం క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌‌‌‌తో భారత్‌‌‌‌ తలపడనుంది.
 
ఎలావెనిల్‌‌‌‌ డబుల్‌‌‌‌ ధమాకా
షూటింగ్‌‌‌‌లో భారత్‌‌‌‌కు శుభారంభం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్‌‌‌‌ వలరివన్‌‌‌‌ రజత పతకం సాధించింది. ఫైనల్లో 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌‌‌‌కు చెందిన హినాటా తైచి 253.0 పాయింట్లతో గోల్డ్​ సాధించి ఆసియా క్రీడల రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యోజిన్‌‌‌‌ బాన్‌‌‌‌ కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు సోనమ్‌‌‌‌ మాస్కర్‌‌‌‌, విదార్సా వినోద్‌‌‌‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లోనూ ఎలావెనిల్‌‌‌‌ రజతం సాధించింది. దీంతో ఆమె ఖాతాలో రెండు సిల్వర్లు చేరాయి.
 
మంధాన రికార్డు మోత
బంగ్లాదేశ్‌‌‌‌తో సెమీఫైనల్‌‌‌‌లో భారత స్టార్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ స్మృతి మంధాన కొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌‌‌‌ స్టార్‌‌‌‌ సుజీ బేట్స్‌‌‌‌ 4,758 పరుగుల రికార్డును అధిగమించేందుకు ఏడు పరుగులు అవసరమైన మంధాన.. మూడో ఓవర్‌‌‌‌లో వరుసగా రెండు ఫోర్లు బాది రికార్డును తన పేరుపైకి మార్చుకుంది. ఆమె 19 బంతుల్లో 37 పరుగులు చేసింది. ప్రస్తుతం మంధాన ఖాతాలో టీ20ల్లో 4,788, అన్ని ఫార్మాట్లలో కలిపి 10,987 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి.