కేంద్ర మంత్రికి ‘సర్’ నోటీసులు.. మాజీ ఉప ప్రధాని LK అద్వానీకి కూడా జారీ

కేంద్ర మంత్రికి ‘సర్’ నోటీసులు.. మాజీ ఉప ప్రధాని LK అద్వానీకి కూడా జారీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయ్ తదితర హైప్రొఫైల్ ప్రముఖులకు సర్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత ఓటర్ల రికార్డులను గత సవరణ (2002) జాబితాతో అనుసంధానం చేయడంలో విఫలమవడం, వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

జాబితాలో ఎవరెవరున్నారంటే..?

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో ఎస్.జైశంకర్ పేర్లు 2002 నాటి ఎస్‌‌‌‌ఐఆర్ జాబితాతో అనుసంధానం కాలేదు. 98 ఏండ్ల ఎల్.కె. అద్వానీ, ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతిక పేర్లు 2002 నాటి ఎస్‌‌‌‌ఐఆర్ ఓటర్ల జాబితాతో అనుసంధానం కాకపోవడంతో వారికి నోటీసులు అందాయి. మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమ,కుమారుడు మీర్‌‌‌‌కు కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపింది. 

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన భార్య వనిత సూద్, తల్లి కమలేశ్ సూద్‌‌‌‌ కూడా ఇదే కేటగిరీ కింద నోటీసులు అందుకున్నారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీతా ద్వివేది కూడా ఈ జాబితాలో ఉన్నారు. మాజీ జస్టిస్ రంజనా దేశాయ్, ఆమె భర్త ప్రకాశ్ దేశాయ్, కుమారుడు మైక్ దేశాయ్, కోడలు సాక్షి దేశాయ్‌‌‌‌కు కూడా నోటీసులు అందాయి.

సీనియర్ బ్యూరోక్రాట్లకూ తప్పని తంటాలు..

రాజకీయ ప్రముఖులే కాకుండా అనేక మంది సర్వీస్‌‌‌‌లో ఉన్నవారు, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారులు, కేంద్ర కార్యదర్శులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ వివాదంపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. నోటీసులు అందుకున్నంత మాత్రాన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని స్పష్టం చేసింది. ఈసీఐఎన్ఈటీ లో డేటాను సరిదిద్దడం కోసమే ఈ సిస్టమ్- జనరేటెడ్ నోటీసులు ఇస్తున్నట్లు తెలిపింది.