సియోల్: డేవిస్ కప్ 2026లో భారత్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో దక్షిణ కొరియా చేతిలో 1–3తో ఓడింది. శనివారం డబుల్స్‌లో ఎన్. శ్రీరామ్ బాలాజీ–దక్షిణేశ్వర్ సురేశ్ జోడీ 6–3, 3–6, 6–3తో విజయం సాధించి భారత్ ఆశలు నిలిపింది. అయితే నాలుగో రౌండ్‌లో సుమిత్ నగాల్ 1–6, 2–6తో క్వాన్ సూన్ వూకు ఓడిపోవడంతో కొరియా విజయాన్ని ఖాయం చేసుకుంది.
శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లో భారత్ ఓటమిపాలైంది. దీంతో శనివారం మిగిలిన మూడు రౌండ్లోనూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబుల్స్‌లో బాలాజీ–సురేశ్ జోడీ తొలి సెట్‌ను గెలిచినా, రెండో సెట్‌లో ప్రత్యర్థులు పుంజుకున్నారు. నిర్ణాయక సెట్‌లో కీలక బ్రేక్ సాధించిన భారత జోడీ మ్యాచ్‌ను ముగించింది. తాజా ఓటమితో భారత్ 2027 డేవిస్ కప్ క్వాలిఫయర్స్ తొలి రౌండ్‌లో ఆడాల్సి ఉంటుంది.
