మాస్కోపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. రష్యా రాజధాని చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్

మాస్కోపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. రష్యా రాజధాని చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్
  • ఆయిల్ ​రిఫైనరీపై బాంబులు
  • దాడుల్లో ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
  • ఉక్రెయిన్‌‌‌‌పై మిస్సైల్స్తో విరుచుకుపడ్డ రష్యా
  • నలుగురు మృతి.. మరో నలుగురికి గాయాలు

మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ ఊహించని రీతిలో విరుచుకుపడింది. పార్లమెంటరీ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ, రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ సేనలు చేపట్టిన అతిపెద్ద డ్రోన్ దాడి రష్యాను ఉలిక్కిపడేలా చేసింది.

రాత్రికి రాత్రే దాదాపు వెయ్యికి పైగా మానవరహిత డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో మాస్కో ప్రాంతంలో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 74 ఏళ్ల వృద్ధుడు, 44 ఏళ్ల మహిళ ఉన్నట్టు స్థానిక గవర్నర్ ఆండ్రీ వెల్లడించారు.

420 డ్రోన్లు కూల్చివేత..
రాజధాని చరిత్రలోనే ఇది ‘అత్యంత తీవ్రమైన దాడి’ అని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ పేర్కొన్నారు. మాస్కో వైపు దూసుకొచ్చిన 450 డ్రోన్లను గగనతలంలోనే పేల్చేసినట్టు ఆయన వెల్లడించారు. అయినప్పటికీ, డ్రోన్ల శకలాలు పడి ఒక ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారం (ఆయిల్ రిఫైనరీ), ఒక నివాస భవనం ధ్వంసమయ్యాయి. దేశవ్యాప్తంగా, క్రిమియా ద్వీపకల్పం, నల్లసముద్ర తీర ప్రాంతాల్లో కలిపి మొత్తం 1,110 ఉక్రెయిన్ డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

స్వదేశీ క్షిపణులతో దెబ్బకొట్టాం: జెలెన్‌‌‌‌స్కీ
రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఫ్లెమింగో’, ‘పెలికాన్’ క్షిపణులతో పాటు అత్యాధునిక డ్రోన్లతో ఈ దాడి నిర్వహించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ ప్రకటించారు. ‘‘రష్యా యుద్ధ యంత్రానికి ఆజ్యం పోస్తున్న బిలియన్ల కొద్దీ డాలర్ల చమురు, రవాణా కేంద్రాలనే మేం లక్ష్యంగా చేసుకున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌‌‌‌లో రష్యా క్షిపణి విధ్వంసం
మరోవైపు, రష్యా జరిపిన దాడుల్లో ఉక్రెయిన్‌‌‌‌లో ప్రాణనష్టం సంభవించింది. ఖేర్సన్ ప్రాంతంలోని ఒక క్రైస్తవ ఆశ్రమంపై రష్యా చేసిన డ్రోన్ దాడిలో ఒక మతపెద్ద ప్రాణాలు కోల్పోగా నలుగురు గాయపడ్డారు. శనివారం సాయంత్రం కీవ్ నగరంలో జరిగిన దాడిలో తల్లి, ఇద్దరు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారి ఆదివారం మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొన్నది.
 
వివాదాస్పద ఎన్నికల వేళ ఉద్రిక్తత
ఎలాంటి బలమైన ప్రతిపక్షం లేకుండా.. అధ్యక్షుడు పుతిన్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు నిర్వహిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. తాము ఆక్రమించుకున్న 4 ఉక్రెయిన్ ప్రాంతాలతోపాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ రష్యా పోలింగ్ నిర్వహించడాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది.

ఖేర్సన్‌‌‌‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంలో జరిగిన దాడిలో స్థానిక ఎన్నికల కమిటీ సభ్యుడొకరు మరణించినట్టు రష్యా ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగేండ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో సరిహద్దుల్లో సైనిక కదలికలు నెమ్మదించినప్పటికీ.. దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా గుండెల్లో ఉక్రెయిన్ రైళ్లు పరిగెత్తిస్తోంది.