అమల్లోకి గోబర్ధన్ స్కీమ్.. రూ.23,731 కోట్లతో బయోగ్యాస్ రంగానికి ఊతం

అమల్లోకి గోబర్ధన్ స్కీమ్.. రూ.23,731 కోట్లతో బయోగ్యాస్ రంగానికి ఊతం

న్యూఢిల్లీ: వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన రూ.23,731 కోట్ల గోబర్ధన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. 2026–-27 నుంచి 2035-–36 వరకు పదేళ్ల పాటు ఈ స్కీమ్‌ కొనసాగుతుంది. ఈ స్కీమ్ కింద  కంప్రెష్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఏర్పాటు చేసే సంస్థల నుంచి గ్యాస్‌ను ప్రభుత్వ సంస్థలైన  గెయిల్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థలు కొనుగోలు చేస్తాయి.

పదేళ్ల కాలానికి గాను కిలోకి రూ.98 చొప్పున (రూ. 2,110/ఎంఎంబీటీయూ) ఫిక్స్డ్‌ రేటును ప్రభుత్వం ఖరారు చేసింది.  గోబర్ధన్‌  స్కీమ్‌ కింద  రోజుకు టన్ను సామర్ధ్యంతో పనిచేసే  ప్లాంట్లకు  రూ.1.25 కోట్ల వరకు, గరిష్టంగా రూ.30 కోట్ల వరకు క్యాపిటల్‌ను అందించనుంది.

గ్రామీణ కుటుంబాల కోసం..
మరోవైపు  వ్యక్తిగత రైతులు లేదా గ్రామీణ కుటుంబాలు తమ సొంత ఇంటి అవసరాల కోసం (1 నుంచి కొన్ని క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో) చిన్న బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడానికి గోబర్ధన్  పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటికే దీనికి కేంద్ర ప్రభుత్వం నేరుగా రూ.9,800 నుంచి రూ.14,350 వరకు సబ్సిడీ ఇస్తోంది. gobardhan.co.in పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టరై వివరాలు సబ్మిట్ చేయాలి. వ్యక్తిగత రైతులు స్థానిక జిల్లా పంచాయతీ రాజ్ లేదా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కార్యాలయం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.