- రెండేళ్లలో గ్రేటర్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్లాన్
- ప్రస్తుతం 24 డిపోల్లో మొత్తం బస్సులు 3,200..
- వాటిలో 550 ఎలక్ట్రిక్ బస్సులే
- ఒక్క హెచ్‌సీయూ డిపోలోనే 104 ఈవీ బస్సులు
హైదరాబాద్సిటీ,వెలుగు: గ్రేటర్ఆర్టీసీ పర్యావరణ హిత ఎలక్ట్రిక్బస్సుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగా విడతల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. రాబోయే రెండేళ్లలో గ్రేటర్పరిధిలో 100 శాతం ఇ–బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని 24 డిపోల్లో ఆర్టీసీ 3200 బస్సులను నడుపుతుండగా ఇందులో ఎలక్ట్రిక్బస్సులు 550 వరకు ఉన్నాయి. అన్ని డిపోల్లోనూ దశలవారీగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్లాన్చేస్తున్నారు.
ఒక్క హెచ్‌సీయూ డిపోలోనే 104 బస్సులు
గ్రేటర్పరిధిలోని ఒక్క హెచ్‌సీయూ డిపోలోనే 104 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. వీటిలో 69 ఆర్డినరీ, 35 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉండగా.. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇతర వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే వీటిని నడుపుతున్నారు.
ఈ డిపో పరిధిలోని అన్ని రూట్లలోనూ ఈవీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. హెచ్‌సీయూ తర్వాత మియాపూర్ డిపో రెండో స్థానంలో 95 ఈవీ బస్సులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. చార్జింగ్ స్టేషన్ల విషయంలోనూ హెచ్‌సీయూ డిపో రికార్డు సాధించింది. ఈ డిపోలో అత్యధికంగా 25 ఈవీ పాయింట్లు ఉన్నాయి.
మరో 15 పాయింట్లను పటాన్‌చెరులో సిద్ధం చేస్తున్నట్లు డిపో మేనేజర్ఎం.శ్రీనాధ్ తెలిపారు. ఒక్కో బస్సు గంట సమయంలో వందశాతం చార్జ్ అవుతుండగా.. 240 కి.మీ. మైలేజీ వస్తుందని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఎలాంటి కాలుష్యం, శబ్ధకాలుష్యం లేకపోవడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి.
