ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌లో హరీశ్ రావు ఫాంహౌస్.. 111 జీవో పరిధిలో ఎలాంటి పర్మిషన్లు లేకుండానే నిర్మాణం

ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌లో హరీశ్ రావు ఫాంహౌస్.. 111 జీవో పరిధిలో ఎలాంటి పర్మిషన్లు లేకుండానే నిర్మాణం
  • అసైన్డ్ పట్టాలో పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్​ 
  • డ్రగ్స్, రేవ్ పార్టీలు సహా అనేక బాగోతాలకు అడ్డా  
  • రాష్ట్రంలో ఫాంహౌస్ ఫైల్స్ నడుస్తున్నయ్ 
  • ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి ఆరోపణలు 
  • హరీశ్​రావు, రోహిత్​రెడ్డి ఫాంహౌస్‌‌‌‌లు పరిశీలించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం

చేవెళ్ల, వెలుగు: సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఎఫ్‌‌‌‌టీఎల్, అసైన్డ్​ భూముల్లో ఫాంహౌస్‌‌‌‌ కట్టుకున్నారని కాంగ్రెస్ ​ప్రజా ప్రతినిధుల బృందం ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం ఆదివారం మొయినాబాద్ ​మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్ రెవెన్యూ సర్వే నెం.76లోని హరీశ్ రావు ఫాంహౌస్‌‌‌‌ను పరిశీలించింది. 

ఈ టీంలో ఎంపీలు చామల కిరణ్​కుమార్​రెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్​యాదవ్, బలరాం నాయక్​, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, టీపీసీసీ స్పోక్స్‌‌పర్సన్ గౌరి సతీష్, టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్ ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరీశ్ రావు సిద్దిపేటలో రంగనాయక సాగర్ ప్రాజెక్ట్​మధ్యలో ఉన్న ప్రాంతంలో 6.10 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు అజీజ్ నగర్‌‌‌‌లో111 జీవో, హిమాయత్​సాగర్​ఎఫ్‌‌టీఎల్‌‌లో ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఫాంహౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. 

దేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టరయినా ప్రాజెక్టుల మధ్యలో ఫాంహౌస్​నిర్మించుకున్నారా? అని ప్రశ్నించారు. తాము ఆగర్భ శ్రీమంతులమని, ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌‌లో పెట్టామని మాట్లాడుతున్న కేటీఆర్, హరీశ్ రావు.. వాటిని 2004, 2009, 2014 అఫిడవిట్లలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

కేటీఆర్‌‌‌‌కు అన్ని ఆస్తులు ఎక్కడివి? 
రూ.1000 కోట్లు ఇస్తే తమ ఆస్తులను వదులుకుంటామని చెబుతున్న కేటీఆర్.. అసలు ఆ ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రజా ప్రతినిధుల బృందం డిమాండ్ చేసింది. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎర్రవల్లిలో  ఫాంహౌస్ పక్కనున్న 300 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి దళితులకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేటీఆర్ అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని, ఒకసారి రెండెకరాల ఇంట్లో పుట్టానని, ఇంకోసారి తనకు, తన తండ్రికి ఉండేందుకు హైదరాబాద్‌‌లో ఇల్లే లేదని చెబుతున్నాడని విమర్శించారు.

బాగోతాలకు అడ్డాగా రోహిత్‌‌రెడ్డి ఫాంహౌస్
అజీజ్‌‌నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177/33లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌‌రెడ్డి ఫాంహౌస్ ప్రాంతాన్ని కూడా కాంగ్రెస్ బృందం పరిశీలించింది. అక్కడ వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నుంచి డ్రగ్స్ పార్టీల వరకు రోహిత్‌‌రెడ్డి ఫాంహౌస్ వేదికగా మారిందని విమర్శించారు. 

ఈ ఫాంహౌస్ కూడా111 జీవో పరిధిలోని అసైన్డ్ భూమిలోనే ఉందని, అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో ఫాంహౌస్‌‌ల సంస్కృతిని తీసుకొచ్చిందే బీఆర్‌‌ఎస్ అని ప్రస్తుతం రాష్ట్రంలో ఫాంహౌస్ ఫైల్స్ నడుస్తున్నాయన్నారు. ఈ ఏడాది మార్చిలో రోహిత్‌‌రెడ్డి తన ఫాంహౌస్‌‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారని గుర్తు చేశారు.

పాజిటివ్ వచ్చిన వారిలో రోహిత్‌‌రెడ్డి కూడా ఉన్నారన్నారు. కేదార్ అనే వ్యక్తి అకౌంట్‌‌కు రోహిత్‌‌రెడ్డి తమ్ముడు రితేష్‌‌రెడ్డి రూ.25 లక్షలు ట్రాన్స్‌‌ఫర్ చేశారని, కేదార్ 2025లో దుబాయ్‌‌లో డ్రగ్స్ ఓవర్‌‌డోస్‌‌తో చనిపోయాడన్నారు.  అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన వ్యక్తికి ఎందుకు డబ్బులు పంపారని ప్రశ్నించారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్‌‌పాకాల ఫాంహౌస్‌‌లో జరిగిన పార్టీని ఈగల్ ఫోర్స్ బయటపెట్టిందని గుర్తుచేశారు.