- జనప్రియ ప్రాజెక్ట్స్‌కు రూ.32.17 లక్షల జరిమానా
- 30 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జనప్రియ ప్రాజెక్ట్ సంస్థకు గట్టి షాక్ తగిలింది. రేరారిజిస్ట్రేషన్ రాకముందే కస్టమర్ల నుంచి ఫ్లాట్ బుకింగ్ పేరిట డబ్బులు వసూలు చేసినందుకు ఆ సంస్థపై రూ.32.17 లక్షల జరిమానా విధిస్తూ రేరా ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా రేరా నిధికి చెల్లించాలని స్పష్టం చేసింది.
జనప్రియ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ‘సితార ఎట్ జనప్రియ లేక్ ఫ్రంట్’ ప్రాజెక్ట్‌లోని ఏ2 బ్లాక్‌లో శ్రీధర్ బగలూరి, శ్రిషా బగలూరి దంపతులు ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అయితే ప్రాజెక్టుకు 2024 సెప్టెంబర్ 30న ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చినప్పటికీ.. తాగునీటి సరఫరా, వ్యక్తిగత విద్యుత్ మీటర్ కనెక్షన్లు వంటి కీలక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని కొనుగోలుదారులు రేరాను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అథారిటీ కీలక విషయాలు గుర్తించింది.
ఈ ప్రాజెక్టుకు 2019 అక్టోబర్ 5న రేరా రిజిస్ట్రేషన్ రాగా, అప్పట్లో అంతకంటే ముందే కొనుగోలుదారుల నుంచి డెవలపర్లు ఫ్లాట్ బుకింగ్ కోసం రూ.2,44,608 వసూలు చేసినట్లు రికార్డుల ద్వారా తేలింది. కేవలం ఓసీ ఇవ్వడం అంటే ఫ్లాట్ తాళాలు అప్పగించేందుకు సిద్ధమయ్యామని మాత్రమే అవుతుందని, దాన్ని చట్టబద్ధమైన స్వాధీనంగా పరిగణించలేమని రేరా స్పష్టం చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న నీరు, విద్యుత్ కనెక్షన్లు సహా అన్ని పెండింగ్ పనులను పూర్తి చేసి, కొనుగోలుదారులకు చట్టబద్ధమైన రీతిలో ఫ్లాట్‌ను అప్పగించాలని ఆదేశించింది. అప్పటివరకు స్వాధీనం ఆలస్యమైనందుకు గాను.. ఫిర్యాదుదారులు చెల్లించిన మొత్తాలపై 2024 ఆగస్టు 21 నుంచి ఫ్లాట్ అప్పగించే తేదీ వరకు ఏడాదికి 10.70 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని, అంతేకాకుండా వారి పేరుపై సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని రేరా తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
