- సెమికాన్ ఇండియా సదస్సులో పెట్టుబడులు ప్రకటించిన పలు సంస్థలు
- ఇండియాలో ఏఎస్‌ఎంఎల్ ఆఫీస్
- రూ.48 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న అప్లైడ్ మెటీరియల్స్
- గ్లోబల్ సప్లయర్లతో టాటా ఎలక్ట్రానిక్స్ 16 ఒప్పందాలు
- రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా కొలువు: ప్రభుత్వం
న్యూఢిల్లీ: సెమికాన్ ఇండియా సదస్సు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యింది. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగిన ఈ ఈవెంట్‌లో, గ్లోబల్, దేశీయ కంపెనీలు, రీసెర్చ్ సెంటర్ల మధ్య మొత్తం 56 ఒప్పందాలు కుదిరాయి. దాదాపు రూ. లక్ష కోట్ల (12 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు రానున్నాయని, వీటి ద్వారా లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
పెట్టుబడి ప్రకటనలు..
ఏఎస్ఎంఎల్: చిప్ తయారీకి అవసరమైన లితోగ్రఫీ యంత్రాలను అందించే అతిపెద్ద సంస్థ నెదర్లాండ్స్‌కు చెందిన ఏఎస్‌ఎంఎల్, భారత్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న 300ఎంఎం సెమీకండక్టర్ ఫ్యాబ్‌కు (నెలకు 50 వేల వేఫర్ల కెపాసిటీ) మద్దతు ఇవ్వనుంది. 2032 నాటికి దేశీయ అవసరాల్లో 15–25శాతం వాటా స్థానిక ఫ్యాబ్‌ల నుంచే రావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
అప్లైడ్ మెటీరియల్స్, లామ్ రీసెర్చ్: చిప్ తయారీ పరికరాల కంపెనీ అప్లైడ్ మెటీరియల్స్ రాబోయే 10 ఏళ్లలో దాదాపు 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.48,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలో ఆర్ అండ్ డీ, పరికరాల తయారీకి ఇప్పటికే రూ.3,600 కోట్ల ఒప్పందం చేసుకుంది. మరోవైపు లామ్ రీసెర్చ్ సిలికాన్ విడిభాగాల యూనిట్ కోసం రూ.10 వేల కోట్ల పెట్టుబడిని ఖరారు చేసింది. ఫుజిఫిల్మ్ తమ సెమీకండక్టర్ మెటీరియల్స్ ప్లాంట్ కోసం రూ.800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది.
టాటా ఎలక్ట్రానిక్స్ 16 ఎంఓయూలు: గుజరాత్‌లోని ధోలేరాలో ఫ్యాబ్, అస్సాంలో అసెంబ్లింగ్ -టెస్ట్ యూనిట్ కోసం చేస్తున్న రూ.1.18 లక్షల కోట్ల ప్రాజెక్టుకు మద్దతుగా టాటా ఎలక్ట్రానిక్స్ 16 కీలక ఒప్పందాలు చేసుకుంది. ధోలేరాలో 450 సప్లయర్లు కోసం 363 ఎకరాల్లో ప్రత్యేక పార్కును నిర్మిస్తోంది.
జపాన్, యూరప్, మలేసియా, సింగపూర్‌లకు చెందిన మెటీరియల్స్, స్పెషాలిటీ గ్యాస్, హై ఎండ్ లాజిస్టిక్స్ వంటివి అందించే సప్లయర్లు చేరనున్నారు. ఇందులో నెక్స్‌పెరియా, బెసి, జేఎస్‌ఆర్, ఫిజిఫిల్మ్, సుమిటోమో, అసెండాస్ ఫస్ట్ స్పేస్, ఎ అల్ టీ సెమీకండక్టర్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.
లోకల్ గానే డిజైన్, తయారీ..
కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల (13.5 బిలియన్ డాలర్ల) విలువైన భారీ ప్రోత్సాహకాలను 'సెమికాన్ 2.0' స్కీమ్ కింద ఇవ్వనుంది. దీంతో 12 బిలియన్ డా లర్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంచనావేస్తున్నారు. ఎల్ అండ్ టీ సెమీకండక్టర్స్, ఇండిసెమిక్, ఆక్సిరో వంటి సంస్థలు దేశీయంగా డిజైన్ చేసిన చిప్‌ల తయారీకి సిద్ధమయ్యాయని, ప్రభుత్వం కనీసం 200 చిప్ డిజైన్ స్టార్టప్‌లను డెవలప్ చేయాలని చూస్తోందని తెలిపారు.
ఈ మూడు రోజుల సదస్సుకు 51,000 పైగా రిజిస్ట్రేషన్లు, 40,000 మందికి పైగా సందర్శకులు రాగా, 300 విదేశీ సంస్థలతో సహా 600కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా తదితర దేశాల కంపెనీలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానించాయి.
మన చిప్ ఇండస్ట్రీ ఎదగకుండా కుట్రలు: అశ్విని వైష్ణవ్
సెమీకండక్టర్ డిజైన్, తయారీ రంగాల్లో భారత్ ఎదుగుదలను గ్లోబల్ మార్కెట్‌లోని కొందరు తమకు "ముప్పు"గా భావిస్తున్నారని అశ్విని వైష్ణవ్ అన్నారు. భారత్ ఎదుగుదలను ఇష్టపడని శక్తుల నుంచి సైబర్ దాడులు, సప్లయ్ చెయిన్‌లో ఆటంకాలు కలగొచ్చని హెచ్చరించారు. కాగా, ఇండియాలో ఇప్పటికే మైక్రాన్, కేన్స్ సహా 5 ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించాయి.
టాటా, అప్లైడ్ మెటీరియల్స్ వంటి సంస్థలు భారీ విస్తరణకు సిద్ధమయ్యాయి. రాబోయే ఐదేళ్లలో కార్లు, బైకులు, టీవీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లలో వాడే సెమీకండక్టర్ చిప్‌లను భారత్‌లోనే డిజైన్ చేసి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైష్ణవ్ వివరించారు.
