జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి: మంత్రి పొన్నం

జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి: మంత్రి పొన్నం
  • రిజర్వేషన్లలో 50 శాతం సీలింగ్​ను ఎత్తేయాలి
  • కాంగ్రెస్ ఉద్యమంలో ఓబీసీలు కలిసి రావాలని పిలుపు
  • 100 రోజుల ప్రణాళికతో ఉద్యమం: సచిన్ సావంత్ 
  • పార్లమెంట్ ముట్టడిస్తాం.. రామ్​లీలాలో లక్ష మందితో సభ
  • జాతీయ ఓబీసీ సదస్సులో నేతల హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: బీసీల హక్కుల కోసం దేశ వ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా, బీసీ సంఘాలు ఒకే వేదిక మీదకు రావాలని ఆయన సూచించారు. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, బీసీల హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ]

ఆదివారం బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన “ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు–ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ సుధాకర్, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి బీసీ నేతలు పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌‌ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు.

బీసీల జనాభా ఎంత ఉందో శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో బీసీల సమస్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులను కూడా కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి సమాచారాన్ని సేకరించామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే కచ్చితమైన ఎంపరికల్ డేటా అవసరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన ద్వారా ఎంపరికల్ డేటాను సేకరించిందని తెలిపారు.

దేశంలో వివిధ వర్గాల జనాభా లెక్కలు నిర్వహిస్తున్నప్పటికీ, బీసీల జనాభాను లెక్కించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. “బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించకుండా వారికి ఎంత వాటా ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తాం?” అని మంత్రి ప్రశ్నించారు. కులగణన కేవలం జనాభా లెక్కల ప్రక్రియ కాదని, అది సామాజిక న్యాయానికి పునాది అని స్పష్టం చేశారు.

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50 శాతం రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదన్నారు. బీసీల జనాభా, వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించాలి.. జనాభాకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల ప్రణాళిక తీసుకుని ఓబీసీల కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నామని, ఈ పోరాటంలో దేశవ్యాప్తంగా ఓబీసీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ మోసపూరిత నిర్ణయాలను వ్యతిరేకించాలని ఆయన కోరారు.

ఓబీసీలకు న్యాయమే రాహుల్​ నినాదం: సురేశ్ షెట్కార్
ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఓబీసీ జాతీయ సదస్సు నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఓబీసీ నేతలు పెద్ద ఎత్తున హైదరాబాద్ వచ్చారన్నారు. మేమెంతో మాకంతా వాటా కావాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు న్యాయం జరగాలన్నదే రాహుల్ గాంధీ నినాదం అని గుర్తు చేశారు. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించారన్నారు.

పార్లమెంట్ జరుగుతున్న సమయంలో రామ్‌‌లీలా మైదానంలో ఓబీసీల మీటింగ్ నిర్వహించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ మీటింగ్‌‌కు అన్ని పార్టీల నేతలు అటెండ్ అయి ఓబీసీలకు మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కుర్మ, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, పీఎల్  విశ్వేశ్వరరావు, సింహాద్రి, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రానిది మోసపూరిత వైఖరి
రాష్ట్రీయ ఓబీసీ  మహాసంఘ అధ్యక్షులు భబన్ రావు తైవాడే, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమ నిర్మాణం చేపట్టి వచ్చే పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు.

అదే సందర్భంగా ఓబీసీ కాలం చేర్చకుండా నిర్లక్ష్యం చేస్తే జాతీయస్థాయిలో ఢిల్లీ కేంద్రంగా ఐక్య ఉద్యమాలు చేస్తూ  రామ్ లీలా మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఈ దేశంలో బీసీల సత్తా చూపిస్తామని హెచ్చరించారు, జాతీయ ఓబీసీ సదస్సుకు బీసీ  సంక్షేమ సంఘం కార్యనిర్వాక అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షత వహించారు.