యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే 22ఏలో పెట్టి, వాటి విలువను సున్నా చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. 22ఏ ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ లీడర్లు తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. యాదాద్రి జిల్లా మోటకొండూరులో పలువురు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం సోదరుడు, విప్ మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇండ్లు ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నాయని, ముందు వాటిని కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అజీజ్ నగర్ భూములను 12 ఏండ్ల క్రితమే ఐటీ రిటర్న్స్‌లో చూపించామని వెల్లడించారు.
‘‘కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అనుకున్నా. ఇప్పుడు ఎల్‌నినో కంటే రేవంత్ రెడ్డి మరీ డేంజర్‌గా తయారయ్యాడు. ఉచిత కరెంట్ ఇవ్వడం ఇష్టం లేక, రైతుల పంట పండితే కొనాల్సి వస్తుందనే ఈ కరెంట్ కోతలు, నీటి కోతలు విధిస్తున్నాడు’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు రాజ్యం పోయి రాక్షస పాలన వచ్చిందని అన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చినది అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా మోటార్లు నడపకుండా పంటలను ఎండబెడుతున్నారని, ఎల్‌నినో సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పట్టిసీమ, పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు నీళ్లు తరలిపోతుంటే.. ఇక్కడ మోటార్లు ఆపి తెలంగాణ రైతులను కన్నీళ్లపాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
30 శాతం కమీషన్ల సర్కార్
ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి, ఆయన ఫ్యామిలీకి మాత్రం ఉద్యోగాలు వచ్చాయన్నారు. మూడేండ్లలో కాంగ్రెస్ ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని అసెంబ్లీ సాక్షిగా తేలిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నిలిపివేయడంతో 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు ఆగమయ్యాయన్నారు. 6 గ్యారెంటీల్లో ఒక్కటీ అమలు కావడం లేదని తెలిపారు.
భూముల క్లియరెన్స్‌కు 30 శాతం, ఫైనాన్స్ బిల్లులకు 15 శాతం వసూలు చేస్తున్నారని, ఇదొక కమీషన్ల ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తేలిందని, ఆలేరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్‌లో చేరుతుండటం దీనికి సంకేతమని పేర్కొన్నారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అంతకుముందు వంగపల్లి నుంచి మోటకొండూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
లాగ్ బుక్మాయం చేస్తరా?
అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. కరెంట్సప్లై వివరాలు తెలుసుకోవడానికి ఆయన మోటకొండూరు సబ్‌స్టేషన్‌కు వెళ్లారు. లాగ్ బుక్ ఇవ్వాలని కోరగా.. అది లేదని, ఆన్‌లైన్ నమోదు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. తాను వస్తున్నట్టు గ్రహించి కోతల సంగతి బయటపడుతుందన్న భయంతో లాగ్‌బుక్‌ను మాయం చేశారని హరీశ్ ఆరోపించారు. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినోళ్లకు ఎందుకు రావడం లేదో చూడాల్సిన బాధ్యత లేదా? అన్ని ప్రశ్నించారు.
బొగ్గు కొరత నెపంతో విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి ఆపేసి కోతలు విధిస్తున్నారని విమర్శించారు. కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే సరఫరా జరుగుతున్నదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ డైవర్షన్ పాలిటిక్స్ మాని, సబ్ స్టేషన్ల వద్దకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి చురకలంటించారు. మాజీ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు వెంట ఉన్నారు.
